AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకుటుంబానికే పద్మనాభుడి అలనా, పాలనా బాధ్యతలు

సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోనే సంపదను లెక్కించారు. కానీ ఆరోగది జోలికి మాత్రం పోలేదు. ఎందుకంటే ఆ గది తలుపులకు నాగబంధంతో మూడి పడివుంది. దానిని తెరిస్తే ప్రళయం తప్పదని కొందరు వాదించారు. 16 శతాబ్దంలో రాజా మార్తాండవర్మ కాలం నాటి ఈ రహస్య గదిని సిద్ధపురుషులు మాత్రమే తెరవగలరన్న వాదన కూడా ఉంది.

రాజకుటుంబానికే పద్మనాభుడి అలనా, పాలనా బాధ్యతలు
Balaraju Goud
|

Updated on: Jul 13, 2020 | 4:53 PM

Share

ఆలయ నిర్వహణ హక్కుల కేసు కంటే.. ఆరోగది తలుపులు తెరవడంపై సుప్రీం కోర్టు ఏం చెబుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ కన్పించింది. కానీ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని రాజ కుటుంబానికే వదిలేసింది. ఈ విషయంలో ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ అసలా గదిలో ఏముంది ? గతంలో ఆ గదిని చాలాసార్లు తెరిచారన్న వాదనల్లో నిజమెంత ?

మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో అంతుపట్టని రహస్యాలూ ఉన్నాయి. కానీ పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడ్డ అపూర్వ సంపదలు, అంతుచిక్కని రహస్యాలు మాత్రం మునుపెన్నడూ చూడనవి. అందుకే ఆ దేవాలయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఐదు గదుల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడింది. దీంతో ఆరో గదిలో ఏముందనేది అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే ఐదు గదులు తెరిచినా ఆరోగదిని తెరిచే సాహసం మాత్రం చేయలేదు. ఎందుకంటే, అది తెరిస్తే ఏదో విపత్తు సంభవిస్తుందన్న వాదనలు, బలమైన నమ్మకాలు ఉన్నాయి. అందుకే కోర్టులు సైతం ఆ విషయంలో తలదూర్చడం లేదు.

పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగలోని ఆరోగది తెరవాలని కొందరు, తెరవొద్దని మరికొందరు ఎన్నో వాదనలు వినిపించారు. చివరకు సుప్రీం కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని రాజకుటుంబానికే వదిలేసింది. ఇప్పటికే సుప్రీం కోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలన్నీ ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికే చెందుతాయని స్పష్టం చేసింది. అంటే ఆలయంలోని ఆరో గది తెరవాలా ? వద్దా ? అనేది దానిపై ఆ రాజకుటుంబమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2011లో నేలమాళిగలో గదులు తెరిచి.. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోనే సంపదను లెక్కించారు. కానీ ఆరోగది జోలికి మాత్రం పోలేదు. ఎందుకంటే ఆ గది తలుపులకు నాగబంధంతో మూడి పడివుంది. దానిని తెరిస్తే ప్రళయం తప్పదని కొందరు వాదించారు. 16 శతాబ్దంలో రాజా మార్తాండవర్మ కాలం నాటి ఈ రహస్య గదిని సిద్ధపురుషులు మాత్రమే తెరవగలరన్న వాదన కూడా ఉంది.

కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని క్రీస్తు శకం ఆరో శతాబ్ధంలో నిర్మించారు. 16 శతాబ్ధం నుంచి ఇది ట్రావెన్‌కోర్‌ రాజుల చేతుల్లోకి వెళ్లింది. అప్పటి నుంచి ఆలయం కొన్ని శతాబ్ధాల పాటు ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో డచ్‌, బ్రిటీషర్లు, టిప్పు సుల్తాన్‌ నుంచి ట్రావెన్‌ కోర్‌ రాజ్యానికి ముప్పు పొంచి ఉండడంతో 18 శతాబ్ధంలో ఆలయ పునర్‌నిర్మాణం జరిగినప్పుడు సంపదనంతా నేలమాళిగలో భద్రపరిచారు. ఐదు గదుల్లో దొరికిన సంపద కంటే ఎన్నో రెట్లు సంపద ఆరో గదిలో ఉందని అందుకే దానిని కాపాడేందుకు నాగబంధం వేశారన్న వాదన ఒకటి ఉంది. ఆ తలుపులు తెరవడం నాగబంధంతోనే సాధ్యమవుతుందని కొందరు చెబుతున్నారు. ఇలాంటి వాదనల నేపథ్యంలో ఇటు దైవ నమ్మకాలు, అటు సైంటిఫిక్‌ అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆ గదిని తెరిచేది లేనిది ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికే వదిలేసింది. అసలు రాజకుటుంబానికి ఆ గదిని తెరిచే ఆలోచన ఉందా ? ఉంటే దాన్ని తెరవగలిగే సిద్ధ పురుషులు ఇప్పుడు ఉన్నారా ? అనేది ఆసక్తికరంగా మారింది.

నిజానికి 1930లోనే ఓసారి కొందరు ఆరోగదిలో నిధిని దోచుకునేందుకు విఫలయత్నం చేశారట. అప్పట్లో నల్లత్రాచులు వారిని వెంటాడంతో అక్కడి నుంచి పారిపోయారట. అంతే అప్పటి నుంచి ఏ ఒక్కరూ దానిని తెరిచే సాహసం చేయలదని ఓ కథనం ప్రచారంలో ఉంది. అలాగే సుమారు వందేళ్ల క్రితం తీవ్రమైన కరువు సంభవించినప్పుడు నేలమాళిగ లోని ఆరోగదిని తెరిచే ప్రయత్నం చేశారట. అప్పుడు ఆ గది నుంచి భీకరంగా సముద్ర గర్జనలు వినిపించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. కాదూ కూడదని ఆలయాన్ని తెరిస్తే సముద్రపు నీరు ఆలయాన్ని ముంచెత్తే ప్రమాదం కూడా ఉందట. ఎందుకంటే ఈ ఆలయానికి కేవలం 3.5 కిలోమీటర్ల దూరం లోనే సముద్ర తీరం ఉంది. అయితే, ఆలయ ఆస్తులను ఆడిట్‌ చేసేందుకు వచ్చిన కాగ్‌ మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ఇవన్నీ కట్టు కథలని కొట్టి పారేశారు. 1990లో బి నేలమాళిగను ఏడు సార్లు తెరిచారని ఆయన తన నివేదికలో వెల్లడించారు. ఏదేమైనా ఆలయంలోని ఆరోగది తలుపులు తెరవాలా ? వద్దా ? అనే విషయంపై ట్రావెన్‌ కోర్‌ రాజ కుటుంబానిదే తుది నిర్ణయం.