భర్తపై ‘అఫైర్’ అనుమానం.. రోడ్డుపై కారు ఆపి, తన్నుతూ
తన భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ఆ భార్యకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది. ఆ క్రమంలోనే అతడు మరో మహిళతో కారులో కనిపించాడు.

తన భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ఆ భార్యకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది. ఆ క్రమంలోనే అతడు మరో మహిళతో కారులో కనిపించాడు. దీంతో నడిరోడ్డుపై అతడి కారును ఆపి తన ఆక్రోశాన్ని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటన ముంబయిలోని పెడెర్ రోడ్డులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబయికి చెందిన ఓ వివాహితకు తన భర్తపై గత కొంతకాలంగా అనుమానం ఉంది. ఈ క్రమంలో శనివారం అతడు మరో మహిళతో కలిసి కారులో వెళ్లడాన్ని ఆ మహిళ గమనించింది. వెంటనే అతడి కారును వెంబడించి మధ్యలో ఆపేసింది. అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించింది. కారును ముందుకు వెళ్లనీయకుండా బానెట్‌పైకి ఎక్కి చెప్పుతో కొట్టింది. భర్త కారు నుంచి దిగగానే అతడిని తన్నుతూ తన కోపాన్ని ప్రదర్శించింది. అయితే ఈ లోపు కారులో ఉన్న మహిళ డ్రైవింగ్ చేస్తూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. సదరు వివాహిత ఆమెను కూడా వెంబడించింది. సిగ్నల్ దగ్గర ఆమె కారు ఆగగానే కిందకు లాగి, దాడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఇక వివాహితకు చలాన్ విధించారు.



