అఖిల భారతానికి తలమానికంగా నిలిచే జమ్మూలో భవ్యమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. సుందర జమ్మూలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని గతంలోనే టీటీడీ నిర్ణయించగా.. దానికి ప్రస్తుతం చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా స్థల సేకరణ కోసం టీటీడీ బృందం త్వరలో కశ్మీర్‌కు వెళ్ళనున్నది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన టీటీడీ ట్రస్టు బోర్డు భేటీలో జమ్మూలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తగిన చర్యలు ప్రారంభించిన టీటీడీ అధికారులు త్వరలో జమ్మూ సందర్శనకు వెళ్ళేందుకు రెడీ అవుతున్నారు. టీటీడీ ఈఓ ఏకే సింఘాల్, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి, తిరుపతి జేఈఓ బసంత్ కుమార్ జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు వెళుతున్నారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
జమ్మూలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు టీటీడీ గతంలోనే లేఖ రాసింది. దానికి సానుకూల స్పందన రావడంతో తాజాగా జమ్మూ యాత్రకు రెడీ అయ్యారు టీటీడీ అధికార గణం. అన్ని అనుకూలిస్తే.. వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భూమి పూజ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు.