బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!

తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలయింది. మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు […]

బతుకమ్మ పండుగ.. తొమ్మిది రోజులు ఎనిమిది నైవేద్యాలు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 29, 2019 | 4:23 PM

తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలయింది. మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.

1. ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.

2. అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

3. ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.

4. నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

5. అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

6. అలిగిన బతుకమ్మ : ఆశ్వయుజ పంచమి. ఈనాడు నైవేద్యం సమర్పించరు.

7. వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

8. వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.

9. సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.

తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మలో కలుపుతారు. పూలతో తయారు చేసిన బతుకమ్మపై ఉంచే పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ పుస్తెలకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం. రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి తయారు మలీదను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.