విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ నైపుణ్యాలు.. ఉచితంగా ఆన్ లైన్ పాఠాలు
పిల్లలకు విద్యాతో పాటు టెక్నాలజీతో కూడిన నిపుణ్యాన్ని అందించడం ద్వారా అత్యున్నత ప్రమాణాలు అందించేందుకు ఐటీ దిగ్గజం ముందుకు వచ్చింది.
పిల్లలకు విద్యాతో పాటు టెక్నాలజీతో కూడిన నిపుణ్యాన్ని అందించడం ద్వారా అత్యున్నత ప్రమాణాలు అందించేందుకు ఐటీ దిగ్గజం ముందుకు వచ్చింది. కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), డేటా సైన్సెస్, క్లౌడ్… వంటి న్యూ జనరేషన్ టెక్నాలజీ విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకులను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా ఏఐసీటీ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ దాదాపు 1500 కోర్సు- మాడ్యూల్స్ ను ఇ-లెర్నింగ్ పోర్టల్- ఈఎల్‌ఐఎస్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు ఉచితంగా అందిస్తుంది. ‘మైక్రోసాఫ్ట్ లెర్న్’ ను, ఏఐసీటీఈ కి చెందిన ఈఎల్‌ఐఎస్ ప్లాట్‌ఫామ్‌తో విద్యార్థులు తమంతట తాము నేర్చుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇందుకోసం అధ్యాపకులకు ‘బోధనా పద్ధతులు- టీచింగ్ సామగ్రి’ అందుబాటులోకి తీసుకువస్తారు.
దేశీయంగా టెక్నాలజీ నైపుణ్యాలను బహుముఖంగా పెంపొందించాలనే లక్ష్యంతో ఏఐసీటీఈతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా వివరించింది. కొవిడ్-19 కారణంగా విద్యాసంస్థలు మూతపడి విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు సాంకేతిక సహకారంతో ముందుకు సాగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తమవంతుగా చేయూత అందించడంలో భాగంగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఏఐసీఈటీ ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుధే స్పందిస్తూ, విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావాలంటే వారికి నైపుణ్యాలు ఎంతగానో అవసరమని వివరించారు. మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం ఇందుకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా 18 కంటే పైన వయస్సు గల విద్యార్థులు ‘మైక్రోసాఫ్ట్ అజూరే’ కలిసి నడిచే అవకాశం ఉంటుంది. మొబైల్ యాప్స్ తయారు చేయడం, ఏఐ ఆధారిత సేవలు- ఉత్పత్తులు ఆవిష్కరించడం, బిగ్ డేటా అనాలసిస్… వంటి విభాగాల్లో పనిచేస్తూ 100 డాలర్ల ‘అజూరే క్రెడిట్’ పొందవచ్చు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని వీలవుతుంది. ఇందుకోసం లైవ్ వెబినార్‌లను మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తుంది. అంతేగాక ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కోసం ‘1,000 వరకూ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఓచర్స్’ ను మైక్రోసాఫ్ట్ స్పాన్సర్ చేస్తోంది. టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థలు అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులను ఆన్ లైన్ లో నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందంటున్నారు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు.