వైసీపీ నేత, సీఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్టులకు రెడీ అయ్యారు సిట్ అధికారులు. రెండున్నర నెలలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈకేసుపై సీరియస్‌గా దృష్టి సారించింది. దీంతో దూకుడు పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ..అసలు వివేకాను హత్య చేసింది ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది? నిందితుల వెనుక ఎవరున్నారు అనే విషయాలపై ఆరా తీస్తోంది.
వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన ఆయన ఇంటి వాచ్‌మెన్ రంగయ్యకు నార్కో టెస్టు, మరో నిందితుడు దుద్దెకుంట శేఖర్‌లకు లై డిటెక్టర్ టెస్టులు చేయాలని నిర్ణయింది సిట్. నార్కో పరీక్షలు చేయాలన్న సిట్ విఙ్ఞప్తిని గతంలో పులివెందుల కోర్టు తిరస్కరించింది అయితే తాజగా అదే కోర్టు నార్కో పరీక్షలకు ఓకే చెప్పింది. దీనికోసం నిందితుడు రంగయ్యను హైదరాబాద్‌కు తరలించారు. మరో నిందితుడు శేఖర్‌కు సంబంధించి కోర్టు అనుమతి రావాల్సి ఉంది. మరోవైపు ఇదే కేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై మార్చి 28న పోలీసులు వారిని అరెస్ట్ చేయగా ఇన్నిరోజులుగా నిందితులు రిమాండ్‌లో ఉన్నారు.
మార్చి 15న వైఎస్ వివేకా హత్య జరగగా ముందు ఆయన గుండెపోటుతో చనిపోయారని భావించినా.. పోస్ట్‌మార్టమ్‌లో కత్తులతో నరికి చంపినట్లు తేలింది. ఈ హత్యకేసుపై అప్పటి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు సరైన ఆధారాలు లభించలేదు. హత్య జరిగిన రోజునుంచి కేసు దర్యాప్తుపై వివేకా కుమార్తె సునీత అనేక అనుమానాలు సైతం వ్యక్తం చేశారు. తాజాగా ఈ హత్యకేసులో సిట్ స్పీడ్ పెంచింది.