Tiger: కొమురంభీమ్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులి
అమృతగూడ గ్రామం వద్ద గురువారం రోడ్డుపై పులి కనిపించడంతో కలకలం రేగింది. అమృతగూడ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. గ్రామ శివారులో రోడ్డుపై వెళుతుండగా పులి ప్రత్యక్షమై రైతులు, వాహనదారులను భయాందోళనకు గురి చేసింది స్థానికుల కేకలు విన్న పులి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి పారిపోయింది.
నాన్నా పులి కథ కాదు కానీ.. బెబ్బులి సంచారంతో అక్కడ క్షణక్షణం భయంభయం. కొమురంభీమ్ జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు దండోరా వేస్తున్నారు. పెంచికల్ పేట్ మండలం దర్గాపల్లిలో పులి సంచరిస్తోంది. ఈ పరిస్థితుల్లో పొలం పనులకు వెల్లే రైతులు గుంపులుగా వెళ్లాలనీ, సాయంత్రం తొందరగా పనులను ముగించుకోని ఇంటికి చేరుకోవాలని గ్రామంలో డప్పు చాటింపు వేయించారు అటవీశాఖ అధికారులు. అదే సమయంలో పశువుల కాపరులను అడవిలోకి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. తాజాగా అమృతగూడ గ్రామం వద్ద పులి సంచారం కలకలం రేపింది.
మొన్నీమధ్యనే, అంటే ఈనెల 19న ఇదే జిల్లాలో కౌటాల మండలం గుండాయిపేట్ గ్రామంలో నవీన్ అనే రైతు- మిర్చి తోటలో పనిచేస్తుండగా, ఒక్కసారిగా పులి అరుపులు వినిపించాయి. పులిని చూసి నవీన్ భయంతో పరుగులు తీశాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు రంగంలోకి దిగారు. పులి పాదముద్రలు గుర్తించారు. అంతేగాదు, అదేరోజున మంచిర్యాల జిల్లా మందమర్రిలో కూడా పెద్దపులి- ట్రాప్ కెమెరాకు చిక్కింది. అందుగులపేట అడవుల్లో ఆడపులిని గుర్తించారు.
ఈనెల 18వ తేదీన కొమురంభీమ్ జిల్లాలో రైల్వే లైన్‌మెన్ కంటపడింది పులి. మాకాడి అనే ప్రాంతం దగ్గర పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కింది. ఇలా పెద్దపులులు, చిరుతలు వరుసగా కంట పడుతుండటంతో, జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రూరమృగాల బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో, దండోరాలు వస్తున్నారు.