పరువు, ప్రతిష్టలా మారిన ఎన్నికల నిర్వహణ, ఏపీ సర్కారుకి సుప్రీంలోనూ షాక్, ఎస్ఈసీ మీటింగ్‌కు అధికారుల గైర్హాజరీపై ఉత్కంఠ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆసక్తికరంగా మారింది. గురువారం నుంచి క్షణ క్షణం పరిస్థితులు మారిపోతున్నాయి. సంచలన విషయాలు,..

  • Venkata Narayana
  • Publish Date - 7:58 pm, Fri, 22 January 21
పరువు, ప్రతిష్టలా మారిన ఎన్నికల నిర్వహణ, ఏపీ సర్కారుకి సుప్రీంలోనూ షాక్, ఎస్ఈసీ మీటింగ్‌కు అధికారుల గైర్హాజరీపై ఉత్కంఠ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఆసక్తికరంగా మారింది. గురువారం నుంచి క్షణక్షణం పరిస్థితులు మారిపోతున్నాయి. సంచలన విషయాలు, ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల క్రతువు మొత్తం ఎన్నికల సంఘం వర్సెస్ జగన్ ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది. అటు, ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి, ఉద్యోగ సంఘాల నుంచీ అభ్యంతరాలు, అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తిదాయకంగా మారిపోయింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చకచకా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో స్ధానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో శుక్రవారం ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, కోర్టు సమయం ముగియటంతో పిటిషన్ విచారణకు రాలేదు. అంతకుముందు పిటిషన్‌లో చిన్న సవరణలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఏపీ సర్కార్‌ పునరాలోచనలో పడింది. బదులుగా సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసే యోచనలో జగన్ సర్కార్‌ తలమునకలై ఉంది. మరోవైపు, స్దానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ధర్మాసనం తీర్పును ఏపీ ఉద్యోగుల సంఘం జేఏసీ కూడా సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఎస్ఈసీ సిద్దమవుతుంటే, ఎన్నికలు వద్దంటోంది జగన్‌ సర్కార్.

కాగా, గురువారం ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకి ఈ విషయంలో చుక్కెదురైంది. ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణ నిలిపి వేస్తూ ఇంతకు ముందు ఏపీ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో శనివారం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇదిలాఉండగా, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు రావాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం అధికారికంగా సమాచారమిచ్చారు. ఉదయం 10 గంటలకు రావాలని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌ సహా అధికారులకూ ఎస్‌ఈసీ సమాచారం అందించారు. సీఎం జగన్‌ తో సమావేశం ఉన్నందున్న హాజరు కాలేమని అధికారులు ఎన్నికల సంఘానికి చెప్పుకొచ్చారు. అయితే, మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశానికి రావాలని అధికారులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరోసారి సమాచారం పంపారు. అయినా పంచాయత్‌ రాజ్‌ శాఖ అధికారులు హాజరుకాలేదు. దీంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు హాజరు కావాలంటూ పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ కు మెమో పంపించారు ఎస్‌ఈసీ. దీనికి సమాధానంగా భేటీకి రాలేమని రాతపూర్వకంగా సమాధానం ఇస్తామని ఎస్‌ఈసీ కార్యాలయానికి తిరుగు టపా పంపించారు పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు.

ఎన్నికల సంఘం సమావేశానికి పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు గైర్హాజరీ పై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సదరు పంచాయితీ రాజ్ అధికారుల పై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్‌‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. అంతేకాదు, గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను విధుల నుంచి బదిలీ చేయాలన్న నిమ్మగడ్డ, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌ రెడ్డి, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం సీఐలను ఎన్నికల విధుల నుంచి తొలగించాలంటూ సీఎస్‌కు లేఖ రాశారు. తొలగించిన అధికారుల స్ధానంలో ముగ్గురేసి అధికారుల పేర్లను సూచించాలని కూడా సీఎస్‌ కు నిమ్మగడ్డ లేఖ పంపారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏపీ ప్రభుత్వానికి పరువు వ్యవహారంగా మారిపోయినట్టు కనిపిస్తోంది.

తాజా వార్త : ఇదిలాఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కేసులో ఏపీ సర్కారుకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం రాత్రి తిరస్కరిస్తూ ఆదేశాలిచ్చింది. హౌజ్ మోషన్ తిరస్కరిస్తూ నిర్ణయం చేసిన సుప్రీం కోర్టు ఈ కేసుపై సోమవారం విచారణ జరుపుతామని తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లో నోటిఫికేషన్ కూడా రద్దు చేసే అవకాశం ఉందని, సోమవారం వాదనలు వినిపించాలని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.