మోదీ కేబినెట్‌లో శివసేన నుంచి అరవింద్ సావంత్…
నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో శివసేన నేత అరవింద్ సావంత్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటు దక్కనుందని రౌత్ వెల్లడించారు. దీనిలో భాగంగా శివసేన నుంచి మంత్రిగా ఒకరికి అవకాశం రావడంతో అరవింద్ సావంత్ పేరును ఉద్ధవ్ థాకరే ప్రతిపాదించారని, సావంత్ ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబై సౌత్ నియోజకవర్గం […]
నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వంలో శివసేన నేత అరవింద్ సావంత్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటు దక్కనుందని రౌత్ వెల్లడించారు. దీనిలో భాగంగా శివసేన నుంచి మంత్రిగా ఒకరికి అవకాశం రావడంతో అరవింద్ సావంత్ పేరును ఉద్ధవ్ థాకరే ప్రతిపాదించారని, సావంత్ ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన చెప్పారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి 68 ఏళ్ల అరవింద్ సావంత్ ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మిలంద్ డియోరాపై 1 లక్షా 67 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన సావంత్‌కు శివసేన తొలినాళ్ల నుంచి అనుబంధం ఉంది. మహానగర్ టెలిఫోన్ నెట్‌వర్క్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్) ఇంజనీర్‌గా తొలినాళ్లలో పనిచేసిన సావంత్.. 1995లో శివసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా నుంచి మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నిక కావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2014లో తొలిసారి లోక్‌సభకు పోటీ చేసి అప్పటి ముంబై సౌత్ ఎంపీగా ఉన్న డియోరాపై లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. శివసేన డిప్యూటీ నేతగా ఉన్న అరవింద్ సావంత్, ఎంటీఎన్ఎల్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.