వారణాసి కౌన్సిల్ ఎన్నికల్లో 2 సీట్లలో బీజేపీ ఓటమి, సమాజ్ వాదీ పార్టీ విజయం
ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. విధాన పరిషత్ ఎన్నికల్లో రెండు సీట్లలో పార్టీ ఓటమిని చవి చూసింది. పదేళ్లుగా తన అధీనంలో ఉన్న ఈ రెండు స్థానాలనూ పార్టీ కోల్పోయింది.

ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. విధాన పరిషత్ ఎన్నికల్లో రెండు సీట్లలో పార్టీ ఓటమిని చవి చూసింది. పదేళ్లుగా తన అధీనంలో ఉన్న ఈ రెండు స్థానాలనూ పార్టీ కోల్పోయింది. వీటిలో ఒకటి టీచర్లకు, మరొకటి పట్టభద్రులకు రిజర్వ్ చేసినవి. ఈ రెండు స్థానాలనూ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోవడం విశేషం. వారణాసి డివిజన్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాన్ని అశుతోష్ సిన్హా, టీచర్స్ డివిజన్ ని లాల్ బిహారీ యాదవ్ గెలుచుకున్నారు. గత మంగళవారం యూపీ కౌన్సిల్ లోని 11 సీట్లకు ఎన్నికలు జరగగా, బీజేపీ 4, సమాజ్ వాదీ పార్టీ 3 సీట్లలో విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థులు మరో రెండింటిని దక్కించుకోగా మరో రెండు సీట్ల ఫలితాలు తేలవలసి ఉంది.
ప్రస్తుతం యూపీ కౌన్సిల్ లో 100 మంది సభ్యులున్నారు. భారతీయ జనతా పార్టీకి మంచి పట్టున్న స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించడం ఆశ్చర్యకరమని అంటున్నారు. వారాణసి లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ రెండుసార్లు గెలిచారు. 2014 లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన, 2019 లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధిపైన ఆయన విజయం సాధించారు. అంతకు ముందు వారణాసి నియోకవర్గానికి బీజేపీ నేత ఎం.ఎం. జోషీ ప్రాతినిధ్యం వహించారు.



