ఇమ్రాన్ ఖాన్ ! మా విమానం మాకిచ్చేయ్ !..సౌదీ ప్రిన్స్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పట్ల సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనం సంచలనం రేపింది. ఒక విధంగా ఇమ్రాన్ ను సల్మాన్ అవమానించినట్టేనన్న కథనం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో గత నెలలో జరిగిన 74 వ సెషన్ సందర్భంగా ఇమ్రాన్ వ్యవహరించిన తీరు పట్ల సౌదీ రాజుగారు లోలోపలే అగ్గిమీద గుగ్గిలమయ్యారట. ఇమ్రాన్ మొదట న్యూయార్క్ కు వెళ్తూ […]

  • Anil kumar poka
  • Publish Date - 5:32 pm, Mon, 7 October 19
ఇమ్రాన్ ఖాన్ ! మా విమానం మాకిచ్చేయ్ !..సౌదీ ప్రిన్స్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పట్ల సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనం సంచలనం రేపింది. ఒక విధంగా ఇమ్రాన్ ను సల్మాన్ అవమానించినట్టేనన్న కథనం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో గత నెలలో జరిగిన 74 వ సెషన్ సందర్భంగా ఇమ్రాన్ వ్యవహరించిన తీరు పట్ల సౌదీ రాజుగారు లోలోపలే అగ్గిమీద గుగ్గిలమయ్యారట. ఇమ్రాన్ మొదట న్యూయార్క్ కు వెళ్తూ .. తమ రాజధాని జెడ్డాలో ఆగినప్పుడు ఆయనకు గౌరవ సూచకంగా తన ప్రయివేటు జెట్ విమానాన్ని ప్రిన్స్ మహమ్మద్ బిన్ ‘ అప్పగించారు ‘. ఇమ్రాన్, ఆయన ప్రతినిధిబృందం సాధారణ కమర్షియల్ విమానంలో వెళ్లే బదులు, తన ఈ ఫ్లైట్ లో ప్రయాణించాలని ఆయన కోరాడట. ఇలా అని పాకిస్తానీ మీడియా తన వార్తల్లో పేర్కొంది. ఇమ్రాన్ తిరిగి న్యూయార్క్ నుంచి ఇస్లామాబాద్ కు గత నెల 28 న ఆ విమానంలో ప్రయాణించబోగా.. సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆయన ఉసూరుమంటూ మళ్ళీ న్యూయార్క్ చేరుకున్నాడు. అక్కడినుంచి కమర్షియల్ ప్లేన్ లో పయనమయ్యాడు.
కానీ-ఫ్రైడే టైమ్స్ వీక్లీ మ్యాగజైన్ కథనం ప్రకారం..అసలు విషయం ఇలా ఉంది. (ఈ ఆర్టికల్ ఈ నెల 4 న ప్రచురితమైంది).

న్యూయార్క్ లో ఇమ్రాన్ ఖాన్ అనుసరించిన ‘ దౌత్యనీతి ‘ పట్ల సౌదీ రాజు అసహనం వ్యక్తం చేశారని, ఇమ్రాన్-టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తోను, మలేసియా ప్రధాని మహాతిర్ మహమ్మద్ తోను మిలాఖత్ అయి.. ‘ ఐక్య ఇస్లామిక్ బ్లాక్ ‘ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం ఆయనకు అసలు నచ్ఛలేదన్నది ఈ వార్త సారాంశం.
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిములు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ బీబీసీ తరహాలో ఓ ఇంగ్ల్లీష్ ఛానల్ ను లాంచ్ చేయాలని ఆ ముగ్గురూ నిర్ణయించుకోవడాన్ని సౌదీ రాజు జీర్ణించుకోలేకపోయాడట. పైగా గల్ఫ్ లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అవసరమైతే తాను ఇరాన్ తో మధ్యవర్తిత్వం వహించడానికి కూడా రెడీగా ఉన్నానని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సౌదీ రాజు కూడా తనను ఇలాగే కోరారని ఇమ్రాన్ ‘ గొప్పలు ‘ చెప్పుకోవడంతో… సౌదీ ప్రిన్స్ కు చిర్రెత్తుకొచ్చిందని ఈ ఆర్టికల్ లో పేర్కొన్నారు.అయితే ఈ వార్తను పాకిస్తాన్ ప్రభుత్వం ‘ రబ్బిష్ ‘ అంటూ కొట్టి పారేసింది. ఇదంతా ‘ కట్టుకథ ‘ అని అభివర్ణించింది. ఏది ఏమైనా.. సౌదీ రాజు తన విమానాన్ని తిరిగి తనకు ఇచ్ఛేయమన్నట్టే లెక్క అన్నకథనం లా ఉందీ యవ్వారం అని కొన్నిఅంతర్జాతీయ పత్రికలు ఘోషించాయి.