‘దేశానికి సేవ చేసే భాగ్యం కలిగింది.. ఐ యామ్ లక్కీ’.. జ్యోతిరాదిత్య సింధియా
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా .. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ దేశ భవితవ్యం మోదీ చేతుల్లో భద్రంగా ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా .. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ దేశ భవితవ్యం మోదీ చేతుల్లో భద్రంగా ఉంటుందని అన్నారు. బుధవారం కాషాయ కండువా కప్పుకున్న అనంతరం ఢిల్లీలో మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ దేశానికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు తానెంతో అదృష్టవంతుడినన్నారు. ‘ప్రధానికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి.. ఆయనకు ఒకసారి కాదు.. రెండు సార్లు వఛ్చిన ప్రజాతీర్పు, విజయం ఈ దేశ చరిత్రలో మరే ప్రభుత్వానికీ, ఏ నేతకూ రాలేదు.. ఈ దేశానికి అంతర్జాతీయంగా ఆయన తెచ్చిన ప్రతిష్ట, ఆయన అమలు చేస్తున్న పథకాలు అద్భుతం.. మోదీ చేతుల్లో ఇండియా భవితవ్యం చాలా సేఫ్ గా ఉంటుంది’ అని సింధియా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను భారమైన హృదయంతో వీడానని, ఇక దాన్ని తాను పార్టీగా భావించబోనని ఆయన చెప్పారు. ‘నా జీవితంలో రెండు ప్రధానమైన రోజులున్నాయి. ఈ రెండూ నా తండ్రి మాధవరావు సింధియాకు సంబంధించినవి.. 2001 సెప్టెంబరు 30 న ఆయన విమాన ప్రమాదంలో మరణించిన రోజు ఒకటి కాగా.. నిన్న ఆయన 75 వ జయంతి రోజు’ అని జ్యోతిరాదిత్య వివరించారు. ఈ జయంతి నాడే తను కాంగ్రెస్ పార్టీని వీడానని అన్నారు.
నా ఇదివరకటి పార్టీలో ఈ దేశప్రజలకు, దేశానికి సేవ చేయలేక పోయినందుకు ఎంతో బాధ పడుతున్నానని, వీరికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని, అది రాజకీయాలతోనే సాధ్యపడుతుందని సింధియా వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ పార్టీతో అది సాధ్యపడలేదన్నారు.
ఎన్నో ఆశలు, ఆశయాలతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అయితే ఈ 18 నెలల కాలంలో అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయని ఆయన పేర్కొన్నారు. కాగా-త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో సింధియాకు బీజేపీ ఈ సీటును ఇఛ్చి.. ఆతరువాత కేంద్రంలో మంత్రి పదవిని ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సహజంగానే ఆయన బీజేపీకి, ప్రధాని మోదీకి ‘జై’కొట్టక తప్పలేదు.