దర్బార్: రివ్యూ
చిత్రం: దర్బార్ నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ నటీనటులు: రజనీకాంత్, సునీల్ శెట్టి, నయనతార, నివేదా థామస్, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా, దలీప్ తాహిల్, యోగి బాబు, శ్రీమాన్, రనీష్ త్యాగరాజన్ తదితరులు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్ నిర్మాత: అల్లిరాజా సుభాస్కరన్ సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ కెమెరా: సంతోష్ శివన్ ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్ మాటలు: శ్రీ రామకృష్ణ విడుదల: 09.01.2020 కొన్ని సినిమాలు ఫస్ట్ లుక్ నుంచే ఊరిస్తుంటాయి. అందులోనూ స్టార్ […]
చిత్రం: దర్బార్ నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ నటీనటులు: రజనీకాంత్, సునీల్ శెట్టి, నయనతార, నివేదా థామస్, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా, దలీప్ తాహిల్, యోగి బాబు, శ్రీమాన్, రనీష్ త్యాగరాజన్ తదితరులు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్ నిర్మాత: అల్లిరాజా సుభాస్కరన్ సంగీతం: అనిరుద్ రవిచంద్రన్ కెమెరా: సంతోష్ శివన్ ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్ మాటలు: శ్రీ రామకృష్ణ విడుదల: 09.01.2020
కొన్ని సినిమాలు ఫస్ట్ లుక్ నుంచే ఊరిస్తుంటాయి. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు ప్రీ రిలీజు వరకు ప్రతి కదలికలోనూ అభిమానుల్లో అంచనాలను పెంచుతూ ఉంటాయి. ‘దర్బార్’ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు రజనీకాంత్ మరింత యంగ్‌గా కనిపిస్తున్నారనే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. దానికి తోడు దుమ్ముధూళీ అంటూ తన పాటలతో అనిరుద్ కూడా అంచనాలను పెంచేశాడు. 2020 సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఫస్ట్ మూవీ ‘దర్బార్’. రజనీకాంత్ కెరీర్లో ఈ మూవీ ఎలాంటి స్థానం పొందుతుంది.. చదివేద్దాం! కథ ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) పోలీస్ డిపార్ట్ మెంట్‌లో కీ రోల్‌లో ఉంటాడు. ఐ యామ్ ఎ బ్యాడ్ పోలీస్ అని గట్టిగా చెబుతుంటాడు. అరాచకాలు సృష్టించే ప్రతి ఒక్కరినీ హతమారుస్తుంటాడు. అవన్నీ నకిలీ ఎన్‌కౌంటర్లని మానవహక్కుల సంఘం అతన్ని నిలదీస్తుంది. ఓ సందర్భంలో ఆ సంఘం సభ్యులను కూడా బెదిరించి, తనకు తగ్గట్టు రిపోర్ట్ రాయించుకుంటాడు. అతను అలా మారడానికి కారణం అతను కూతురు వల్లి (నివేదా థామస్). ముంబైలో ఆదిత్య సిటీ కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు వినోద్ మల్హోత్రా (నవాబ్ షా) కుమారుడు అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్)ని ఎన్‌కౌంటర్ చేస్తాడు. అజయ్ మల్హోత్రా మరణంతో ముంబైకి డ్రగ్స్ సరఫరా ఆగిపోతుంది. మంచి జరిగిందని ఆనందించే లోపు ఆదిత్యకు కూతురు దూరమవుతుంది. ఆమెను అతన్నుంచి దూరం చేసింది హరిహరన్ చోప్రా (సునీల్ శెట్టి). హరిహరన్ చోప్రా అలియాస్ హరి చోప్రా ఎందుకు ఆ పనిచేశాడు? అతనికి అజయ్‌కి ఉన్న సంబంధం ఏంటి? చెడ్డ కొడుకు తండ్రికి దూరం కావడానికి, మంచి కూతురు దూరం కావడానికి ఉన్న తేడా ఎలాంటిది? ఓ వైపు సిటీ కమిషనర్‌గా హల్‌చల్ సృష్టించిన ఆదిత్యకు లిల్లి (నయనతార) ఎదురైనప్పుడు ఎందుకు మాట తడబడుతుంది? ఇంతకీ లిల్లికి, ఆదిత్యకు మధ్య పరిచయం పెరిగిందా? తరిగిందా? వల్లి – లిల్లి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు. ప్లస్ పాయింట్లు – రజనీ స్టైల్ – స్టంట్స్ – నివేదా థామస్ యాక్టింగ్ – విజువల్ రిచ్‌నెస్ – ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్లు – ప్రేక్షకుడి ఊహకు అందే ట్విస్టులు – విలనిజం బలంగా లేకపోవడం – హీరోయిన్ కి ఇంపార్టెన్స్ లేకపోవడం – టైటిల్స్ లోనే బోలెడన్ని తప్పులు
సమీక్ష సంక్రాంతికి తలైవర్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కి అదో రకం కిక్కు. ఆ కిక్కును, రజనీకాంత్ మాస్ పల్స్ ను పట్టుకున్నాడు మురుగదాస్. రీసెంట్ టైమ్స్ లో వచ్చే రజనీకాంత్ సినిమాలన్నీ ఒక రకంగా ఈ కోవలోకే చేరుతున్నాయి. ఈ మూవీలో కూడా అలాంటిదే. కాకపోతే ఓ మంచి పని, ఓ చెడ్డ పనికి మధ్య ఉన్న అంతరాన్ని చూపించగలిగాడు డైరక్టర్. పోలీస్ ఆఫీసర్ల జీవితాలు, వాళ్ల కుటుంబాలు, అనుబంధాలు వంటి విషయాలను ఇంతకు ముందు చాలా సార్లు స్క్రీన్ మీద చూశాం. ఇందులోనూ అలాంటిదే కనిపిస్తుంది. కానీ రెండు గంటల్లో చనిపోతానని తెలిసిన కూతురు తండ్రిని పొదివి పట్టుకుని పడుకున్న తీరు మాత్రం చూపరులకు కంటతడి పెట్టిస్తుంది. రజనీకాంత్ – నయనతార కాంబినేషన్‌కు ఆడియన్స్ ఎప్పుడూ ఫిదా అవుతుంటారు. ఇందులోనూ అలాంటి సీన్స్ ఉన్నాయి. కాకపోతే వాటిని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బావుండేది. వారి మధ్య సన్నివేశాల సంఖ్య కూడా ఇంకాస్త ఎక్కువగా ఉండాల్సింది. నివేదా థామస్‌కు మరింత ఇంపార్టెన్స్ ఉంది మూవీలో. ట్విట్టర్‌లో ‘నా తండ్రి ఆదిత్య అరుణాచలం’ అని ఆమె ప్రకటించిన దానికి అర్థం సినిమా చూస్తే తెలుస్తుంది. డైలాగులకు అక్కడక్కడా ప్రేక్షకుల విజిల్స్ వినిపిస్తున్నాయి. తలైవా తలైవా అంటూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. పాటల్లో సాహిత్యం వెతుక్కోకుండా బీట్స్ ని ఎంజాయ్ చేసేవారికి కచ్చితంగా ఊపునిస్తాయి. చూసినంత సేపు రజనీ ఎనర్జీ స్క్రీన్ మీద బావుంది. షర్ట్ విప్పి ఆయన ఎక్సర్‌సైజ్ చేసే ప్రీ క్లైమాక్స్ షాట్స్ ఫ్యాన్స్ కి తప్పక నచ్చుతాయి. హీరో – హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం గురించి బాహాటంగా ప్రస్తావించడం కూడా ఇందులో గమనించాల్సిన విషయం.
ఈ సినిమాకు సంబంధించి మరీ ముఖ్యంగా ప్రస్తావించాల్సిన అంశం ఒకటి ఉంది. తెలుగులో రజనీకున్న మార్కెట్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సిందేం లేదు. సంక్రాంతికి రిలీజయ్యే మిగిలిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా ముందుగా పూర్తయ్యాయి. మరి అలాంటప్పుడు తెలుగు టైటిల్స్ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ‘సమర్పకుడు’ అని రాయడానికి బదులు ‘ప్రస్తుతుంది’ అని టైటిల్ కార్డులో పడటం, ‘సంగీతం’ అని రాయడానికి బదులు ‘సంగీత’ అని రాయడాన్ని నిర్లక్ష్యం అనుకోవాలా? లేకుంటే టైటిల్స్ ని ఎవరు పట్టించుకుంటారని వదిలేయాలా? అనే విషయం అర్థం కాదు. తెలుగువారు చూపించే అభిమానం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే పొరుగు రాష్ట్రాల స్టార్లు, టెక్నీషియన్స్… తమ సినిమాను అనువాదం చేస్తున్నప్పుడు ‘తెలుగు’ భాష పట్ల కూడా కనీస శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో అంతర్లీనంగా… కనిపించే నేమ్ బోర్డుల విషయం ఎలా ఉన్నప్పటికీ, టైటిల్స్ విషయంలో మాత్రం అశ్రద్ధ వహించకుండా ఉండాల్సిందే. ఫైనల్‌గా… రజనీకాంత్ ఫ్యాన్స్ కి పండగ వచ్చినట్టే – డా. చల్లా భాగ్యలక్ష్మి.