లాక్ డౌన్ వేళ.. ఓటీటీ వైపు.. నిర్మాతల చూపు..!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఓటీటీ వేదికగా చిత్రాలను విడుదల చేయడానికి పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఓటీటీ వేదికగా చిత్రాలను విడుదల చేయడానికి పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నిర్మాతలకు మేలు చేకూర్చుతుందని 30 మందికిపైగా నిర్మాతలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘కరోనా సమస్యతో థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే. ఇకపై ఎప్పుడు థియేటర్లను తెరుస్తారో..? రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా కచ్చితమైన సమాచారం ఎవరికీ తెలియదు.
కాగా.. ఇప్పటికే రూ.కోట్లు వెచ్చించి చిత్రాలను తెరకెక్కించిన పలువురు నిర్మాతలు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని ప్రస్తావించారు. ఇదిలా ఉండగా జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్ వందాళ్’ చిత్రాన్ని ఓటీటీ ద్వారా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శక నటుడు భారతిరాజా, త్యాగరాజన్, మురళీధరన్, టి.శివ, కె.రాజన్, జ్ఞానవేల్‌రాజా, మురళి, విజయకుమార్, చిత్రా లక్ష్మణన్, దురైరాజ్, ఫెఫ్సి శివలతో పాటు 30 మందికిపైగా నిర్మాతలు ఓ బృందంగా ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
మరోవైపు.. పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి చిత్రాన్ని తెరకెక్కించే నిర్మాతకు.. ఆ సినిమాను పలు మార్గాల ద్వారా వ్యాపారం చేసుకునే హక్కు ఉందనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని వారు కోరారు. చిన్న, మధ్య తరహా బడ్జెట్ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి ప్రయత్నించాలని ఈ సందర్భంగా సూచించారు. ఇలాంటి విషయాలను స్వాగతించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ బృందం నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ ప్రత్యేక టీమ్‌గా పోటీచేస్తున్న విషయం తెలిసిందే.