కార్గోతో కాసుల వేటలో తెలంగాణ ఆర్టీసీ

లాక్ డౌన్ కారణంగా ఆర్థిక భారంతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజా రవాణేతర ఆదాయంపై దృష్టిసారించింది. దీంతో త్వరిత కాలంలోనే మంచి ఆదరణ రావడంతో సకాలంలో సరుకు రవాణాతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకుంటోంది.

కార్గోతో కాసుల వేటలో తెలంగాణ ఆర్టీసీ
Follow us
Balaraju Goud

| Edited By: Balu

Updated on: Aug 28, 2020 | 11:52 AM

లాక్ డౌన్ కారణంగా ఆర్థిక భారంతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజా రవాణేతర ఆదాయంపై దృష్టిసారించింది. దీంతో త్వరిత కాలంలోనే మంచి ఆదరణ రావడంతో సకాలంలో సరుకు రవాణాతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకుంటోంది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన అనతి కాలంలోనే కార్గో సర్వీసులకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రైవేటు రంగంలోని పార్సిల్‌ సర్వీసులతో పోలిస్తే ఆర్టీసీ కార్గో సేవలు వేగంగా, భద్రతకు ప్రాముఖ్యత ఇస్తుండడంతో మెడిసిన్‌ నుంచి పూలు, పండ్ల వరకు ప్రతీది ఆర్టీసీ కార్గో సర్వీసుల్లో రవాణా చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ కార్గో తీసుకొచ్చిన ‘సురక్ష’ సేవలను రాష్ట్రంలోని వ్యాపారులు పెద్దఎత్తున వినియోగించుకున్నారు. ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌, ట్రాకింగ్‌ వ్యవస్థ ఉండడంతో హైదరాబాద్‌లోని వ్యాపారులు ఆర్టీసీ కార్గో సేవలపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఒక్కో వాహనానికి రూ.20వేల మేర ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 29 డిపోల పరిధిలో 85 సర్వీసులను సరుకు రవాణా కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో డిపోకు మూడు, నాలుగు చొప్పున ఆర్టీసీ కార్గో సర్వీసులను కేటాయించారు. అదే విధంగా కార్గో సేవలను అందించడానికి నగరంలోని బస్‌ స్టేషన్లలో వీటి బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రైవేట్ సరుకులతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన రవాణాకు కూడా వినియోగిస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలామృతం సరఫరాకు కార్గో సర్వీసునే వినియోగిస్తున్నారు. వీటికి టెండర్‌ ధర ప్రకారం చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో జిల్లాకు చెందిన కార్గో బస్సుల ద్వారా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సేవలు పొందుతుంది. నగరంలో కార్గో సర్వీసుల ద్వారా మెడిసిన్‌ నుంచి ఎలక్ర్టికల్‌, దుస్తులు, నిత్యావసరాలు, ధాన్యం, బియ్యం, విత్తనాలు, ఎరువులు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పువ్వులు సరఫరా చేస్తున్నారు. కార్గో, పార్సిల్‌ సేవలు పొందేవారి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తుండడంతో పాటు, పంపిన సరుకులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ట్రాకింగ్‌ వ్యవస్థ కూడా అందుబాటులోకి తేవడంతో వీటికి ఆదరణ పెరుగుతున్నది.

పార్సిళ్ల బరువు, చేర్చాల్సిన గమ్యస్థానం దూరాన్ని బట్టి చార్జీ ఖరారు చేస్తున్నారు. అదీ కూడా నిర్ణీత సమయంలో చేరవేస్తున్న ప్రజాదరణ పొందుతున్నారు. అంతేగాక సరుకు, పార్సిళ్లకు బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. పార్సిల్‌ చార్జీలలో మార్పులు చేసి అందరికీ అందుబాటులో ఉండే విథంగా నిర్ణయించారు. ఇక, జనం కూడా ప్రైవేట్ కంటే ఆర్టీసీ నుంచి సయమపాలనకు అనుగుణం సరుకు రవాణ అవుతుండడంతో ఎక్కువ మొగ్గుచూపుతున్నారు.