పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ… నిండుకుండలా ప్రాజెక్టులు..
ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండు కుండల్లా మారుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది.

ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండు కుండల్లా మారుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది. ఇప్పటికే జలాశయం నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 2,26,751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,54,434 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, పూర్తిస్థాయిలో 884.80 అడుగులకు నీటిమట్టం చేరింది. నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలకుగాను 214.363 టీఎంసీల నీరుంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
అలాగే, నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టుకు 2,20,434 ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,20,143 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 589.30 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 312.05 టీఎంసీలు కాగా, 309.34 టీఎంసీల నిల్వ ఉంది. భారీ వరద నీరు వస్తుండడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.