కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

కుటుంబ కలహాలతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. తాగుబోతు భర్త వేధింపులు, తోటి కోడలు గొడవలు భరించలేక ఆ ఇల్లాలు కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 16, 2020 | 5:02 PM

కుటుంబ కలహాలతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. తాగుబోతు భర్త వేధింపులు, తోటి కోడలు గొడవలు భరించలేక ఆ ఇల్లాలు కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో చోటుచేసుకుంది. చిన్నూరుకు చెందిన రామకృష్ణప్ప, చంద్రశేఖర్‌, తిమ్మప్ప అన్నదమ్ములు.. ముగ్గురూ తమ పొలాల వద్ద వరుసగా ఇళ్లు కట్టుకుని నివాసముంటున్నారు. రామకృష్ణప్ప భార్య పార్వతమ్మ (37)కు తోడికోడళ్లకి తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల రామకృష్ణప్ప మద్యానికి బానిస కావడంతో వారం రోజులుగా ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో పార్వతమ్మ, చిన్న కుమార్తె దివ్య(12)తో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

కనిపించకుండాపోయిన తల్లి పిల్లల కోసం కుటుంబసభ్యలు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకారు. ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన నారాయణాచారి బావి వద్ద బాలిక దివ్య మృతదేహం తేలుతూ కనిపించింది. దీంతో గ్రామస్తులు బావిలో గాలింపు చేపట్టగా పార్వతమ్మ మృతదేహమూ అదే బావిలో లభించిందని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రామకృష్ణప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, రామకృష్ణప్ప, పార్వతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్దకుమార్తె పవిత్ర ఏడాది క్రితం చెట్టు మీద నుంచి పడి చనిపోయింది. ఇంకో కుమార్తె ఆరేళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసింది. చిన్న కుమార్తె దివ్య కూడా ఇప్పుడు మృతిచెందడంతో గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.