AP News: జైలులో సాధారణ తనిఖీలు.. భూమిలోపల కనిపించిన ప్యాకెట్.. తెరిచి చూడగా షాక్
వైజాగ్ సెంట్రల్ జైల్లో అసలు ఏం జరుగుతోంది. మొన్ననే జైలు వార్డర్స్ తనిఖీలు, ఆపై నిరసనలు, కొందరి బదిలీలు. ఈ ఎపిసోడ్ మరచిపోకముందే, వైజాగ్ సెంట్రల్ జైల్లో రెండు సెల్ఫోన్లు దొరికాయి. దీనికి సంబంధించిన స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.?
విశాఖ సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్లు దొరకడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు రెగ్యులర్ తనిఖీలు చేపడుతుండగా.. పెన్నా బ్యారక్ సమీపంలోని భూమిలో నాలుగు అడుగుల లోతున ఓ అనుమానాస్పద ప్యాకెట్ లభ్యమైంది. అందులో ఏముందా అని చూడగా.. ఆ ప్యాకెట్లో రెండు సెల్ఫోన్లు, పవర్ బ్యాంక్, ఫోన్ బ్యాటరీ, రెండు ఛార్జింగ్ కేబుల్స్ కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన మొబైల్ ఫోన్లలో ఎలాంటి సిమ్ కార్డ్స్ లేకపోవడం.. ఇక అవి దొరికిన పెన్నా బ్యారక్‌లో రౌడీ షీటర్ హేమంత్, మరికొందరు ఖైదీలు ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో రౌడీషీటర్ హేమంత్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. విశాఖ జైలులో జరిగిన ఈ పరిణామంపై ఆరిలోవ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు జైలు సూపరింటెండెంట్. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సెంట్రల్ జైలు సిబ్బంది పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి