రూ.5 కాయిన్ చేతికివ్వలేదని కత్తితో దాడి..!
హర్యానాలోని కేర్కిదౌలా టోల్‌ప్లాజా వద్ద కత్తిపోట్లు. రూ.5 కోసం టోల్ ఫ్లాజా సిబ్బందిపై దాడి, ఒకరి పరిస్థితి విషమం. మరోకరికి స్వల్ఫ గాయాలు.
చిల్లర విషయంలో తలెత్తిన గొడవ కత్తిపోట్లకు దారి తీసిన సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హర్యానాలోని బల్లాబర్గ్ ప్రాంతానికి చెందిన రోహిత్, నిఖిల్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో కేర్కిదౌలా టోల్‌ప్లాజా వద్ద టోల్ టాక్స్ కట్టేశారు. అయితే, టోల్ గేట్ సిబ్బంది 5 రూపాయలు కాయిన్ తిరిగి ఇచ్చే క్రమంలో కిందపడిపోయింది. కాయిన్ చేతికివ్వలేదన్న కారణంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో రోహిత్, నిఖిల్‌లు కారులోంచి దిగి కత్తితో టోల్‌ప్లాజా మేనేజర్‌తో పాటు మరో ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ మేనేజర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మరో ఉద్యోగి స్వల్ప గాయాలతో బయటపడి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే అక్కడి నుంచి జారుకున్న రోహిత్, నిఖిల్‌లను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. టోల్‌ప్లాజా మేనేజర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.