కరోనా దెబ్బకు స్లోగన్ మార్చుకున్న ‘కేఎఫ్‌సీ’
కరోనావైరస్ ప్రజల ఆహార అలవాట్లు... వాణిజ్య సంస్థల తీరుతెన్నుల్లో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో.. అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్‌సీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తన నినాదం ‘‘ఫింగర్ లికింగ్ గుడ్’’ను ఉపయోగించడాన్ని ఈ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది.
కరోనావైరస్ విజృంభణ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అన్ని రంగాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అటు ప్రజల ఆహార అలవాట్లు… వాణిజ్య సంస్థల తీరుతెన్నుల్లో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో.. అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కెఎఫ్‌సీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తన నినాదం ‘‘ఫింగర్ లికింగ్ గుడ్’’ను ఉపయోగించడాన్ని ఈ సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. కొవిడ్-19 వ్యాప్తిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు ఈ నినాదం సరిపోదని భావించిన సంస్థ యాజమాన్యం.. వ్యక్తిగత శుభ్రతకు, సామాజిక దూరానికి మరింత ప్రాధాన్యతనిచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే, దాని స్థానంలో ఏ నినాదాన్ని ఉపయోగించాలనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా బిల్‌బోర్డులు, ప్రకటనలు, పదార్థాలను ప్యాక్ చేసేందుకు ఉపయోగించే బ్యాగులు మొదలైన అన్నిటిపై ఆ నినాదం కనిపించకుండా చేసింది.
ఈ సంస్థకు చెందిన ఓ ప్రకటన గురించి బ్రిటన్ అధికారిక సంస్థ ‘అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ’కి 163 ఫిర్యాదులు అందాయి. ఈ ప్రకటనలో నటించిన వ్యక్తులు కెఎఫ్‌సీకి చెందిన ఆహారాన్ని వేళ్లతో నాకి మరీ ఆస్వాదిస్తున్న దృశ్యం ఉండటంతో… ఈ విధమైన ప్రచారం కొవిడ్-19 కట్టడికి ఆటంకం కాగలదని ఈ ఫిర్యాదుల్లో అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో కెఎఫ్‌సీ ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. అంతేకాకుండా, అదే అర్థాన్నిచ్చే తమ స్లోగన్‌ను కూడా దూరం పెట్టింది. అయితే ఈ నినాదమేమీ హానికరం కాదని… ప్రపంచంలో చాలామంది ఆహారాన్ని చేత్తోనే తింటారని పలువురు సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
Friendship ended with Finger Lickin’ Good, now <UNDECIDED NEW SLOGAN> is my best friend. https://t.co/KKm7CNF0Rf
— KFC UK & Ireland (@KFC_UKI) August 24, 2020
కెఎఫ్‌సీ సంస్థను 1930లో హార్లండ్ శాండర్స్ అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో స్థాపించారు. 1950లో తొలి ఫ్రాంచైజీ మొదలుపెట్టిన నాటి నుంచీ ‘ఫింగర్ లికింగ్ గుడ్’ నినాదాన్నే ఉపయోగిస్తూ వస్తున్నారు. కాగా, కెఎఫ్‌సీకి ప్రస్తుతం ప్రపంచమంతటా 22,621 శాఖలున్నాయి. పరిస్థితులు కుదుటపడిన అనంతరం.. ఈ నినాదాన్నే కొనసాగిస్తామని సంస్థ యాజమాన్యం ‘యమ్ బ్రాండ్స్’ తెలిపింది. కాగా, మరో ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ పిజ్జా హట్ కూడా యమ్ బ్రాండ్స్ ఆధీనంలోనే ఉండటం విశేషం.