కేరళ గోల్డ్ కేసుతో శాండల్‌వుడ్ డ్రగ్స్ దందాకు లింకులు
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కర్ణాటక డ్రగ్స్ మాఫియా వ్యవహారంతో లింక్ పడింది. ఈ డ్రగ్ దందాకు కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌కి లింక్ ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కర్ణాటక డ్రగ్స్ మాఫియా వ్యవహారంతో లింక్ పడింది. ఈ డ్రగ్ దందాకు కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌కి లింక్ ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) లోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. బెంగుళూరు మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడు డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడు కె టి రమీస్‌తో మధ్య సంబంధాలు ఉన్నట్లు తేల్చారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య నిత్యం సంప్రదింపులు జరిగాయని అధికారి పేర్కొన్నారు. మొదటినుంచి ఈ రెండు కేసులకు మధ్య సంబంధాలున్నాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే ఎన్‌సిబి అధికారులు మహ్మద్ అనూప్ తోపాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా కేరళ సీపీఎం కార్యదర్శి కుమారుడు, నటుడు బినీష్ కొడియేరి పేరు సాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా బయటకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్‌ను ఎన్‌సీబీ అధికారులు విచారించగా బినీష్ పేరు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ దిశగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చా యి. అంతేకాకుండా, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వప్న సురేశ్‌ను బెంగుళూరులో అరెస్టు చేసిన రోజే డ్రగ్స్ పెడ్లర్ మహ్మద్ అనూప్‌ని బినీష్ బెంగుళూరులో కలుసుకున్నాడు. దీంతో రెండు కేసులకు సంబంధముందా అనే కోణంలో ఎన్‌సీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, తన వ్యాపార కార్యకలాపాలకు సహాయం చేశాడని అనూప్ చేసిన వ్యాఖ్యలను బినీష్ కొట్టిపరేశాడు. తనకు ఒక స్నేహితుడిగా మాత్రమే మహ్మద్ అనూప్ తెలుసునని, డ్రగ్ వ్యవహారం గురించి తానకేం తెలియదని, ఇదంతా రాజకీయ కుట్రేనని ఆరోపించాడు. ఇప్పటికే కన్నడనాట డ్రగ్స్ మాఫియా వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుతో సంబంధమున్నట్లు భావిస్తున్న హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్టుతో శాండల్‌వుడ్‌లోని మరికొంతమంది నటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.