AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ ‘దీక్షా దివస్’కు.. నేటితో పదేళ్లు పూర్తి!

దీక్షా దివస్(నవంబర్ 29, 2009)… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన మలి దశ ఉద్యమంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు. ఇక ఈ రోజు నుంచి సుమారు 11 రోజుల అనంతరం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వెలువడిన తర్వాతే కేసీఆర్ దీక్షను విరమించారు. దీక్ష నేపధ్యం…  నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసన […]

కేసీఆర్ 'దీక్షా దివస్'కు.. నేటితో పదేళ్లు పూర్తి!
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 29, 2019 | 6:08 AM

Share

దీక్షా దివస్(నవంబర్ 29, 2009)… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన మలి దశ ఉద్యమంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు. ఇక ఈ రోజు నుంచి సుమారు 11 రోజుల అనంతరం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వెలువడిన తర్వాతే కేసీఆర్ దీక్షను విరమించారు.

దీక్ష నేపధ్యం… 

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసన తెలుపుతూ ఎన్నో ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. ఇక వీటిని చెదరగొట్టే ప్రయత్నంలో కేంద్రం చాలానే ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకపోయింది. అంతేకాకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీకి నేతృత్వం వహించిన కేసీఆర్.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు. ‘ తెలంగాణ వచ్చుడో…కేసిఆర్ సచ్చుడో’ అనే నినాదంతో నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు.

ఈ క్రమంలోనే సిద్ధిపేటలోని రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలం వద్దకు కేసీఆర్ బయలుదేరి వెళ్తుండగా.. ఆయన దీక్షను అడ్డుకోవడం కోసం కరీంనగర్ మానేరు బ్రిడ్జి వద్ద పోలీసు బలగాలు వాహనాన్ని చుట్టుముట్టాయి. అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా కేసీఆర్ రోడ్డు మీదే ధర్నా చేయడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఆయన్ని ఖమ్మం జైలుకు తరలించారు. అప్పుడు కూడా కేసీఆర్ ఏమాత్రం తొణకలేదు.. బెణకలేదు.. అలాగే జైలులోనే తన దీక్షను కొనసాగించారు.

ఇక రోజులు గడుస్తున్న కొద్దీ కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది.. ఇది తెలుసుకున్న ఉద్యమకారులు తెలంగాణాలోని పలు చోట్ల నిరసనలకు దిగడమే కాకుండా బంద్‌లకు కూడా పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మె వంటివి నాడు తెలంగాణను ఒక ఊపు ఊపాయి. అన్ని వర్గాల వారు ఏకధాటిపైకి వచ్చి కేసీఆర్ వెంటే తామంటూ ముందుకు నడిచారు.

దీనితో చేసేదేమి లేక డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. డిసెంబర్ 8న తెలంగాణ ఏర్పాటుకు అనువుగా సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. అటు సోనియా సూచన మేరకు కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటన చేశారు. ఇక ఆ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వెలువడిన తర్వాత డిసెంబర్ 9న కేసిఆర్ ఆమరణ దీక్షను విరమించారు.

కాగా, ఈ ‘దీక్షా దివస్‌’కు నేటితో పదేళ్లు పూర్తవుతుంది. ఈ తరుణంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన అపారమైన కృషి, త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం.