
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో నేతలు తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. మరోవైపు పార్టీల అధినేతలు ఆయా రాష్ట్రాల రాజధానులకు తరలివెళ్లారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విజయవాడకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం లోటస్‌పాండ్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో విజయవాడకు పయనమయ్యారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో జగన్ విజయవాడలోని వైసీపీ ఆఫీస్ నుంచి పార్టీ నేతలతో కలిసి ఫలితాలు వీక్షిస్తారని తెలుస్తోంది.
అయితే గురువారం మధ్యాహ్నం కల్లా దాదాపు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేలిపోనుంది. మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.