హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. దీపావళికి ముందే విద్యార్థులకు సెలవులు ప్రకటించిన కాలేజీలు!
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో నీటి కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో శ్రీ చైతన్య, నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలు దీపావళి సెలవులను ముందుగానే ప్రకటించాయి. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలోనూ నీటి ఎద్దడి ఆందోళన కలిగిస్తోంది.

Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో తీవ్రరూపం దాల్చుతున్న నీటి కొరత విద్యాసంస్థలపై ప్రభావం చూపుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా సరిగా లేకపోవడంతో రెసిడెన్షియల్ కాలేజీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీపావళి సెలవులను ముందుగానే ప్రకటిస్తూ విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు తమ పలు క్యాంపస్‌లలో దీపావళి వరకు సెలవులు ప్రకటించాయి.
క్యాంపస్‌లకు ట్యాంకర్ల ద్వారా అందాల్సిన నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో విద్యార్థులకు కనీస అవసరాలైన తాగునీరు, వంటకు అవసరమైన నీరు, స్నానాలకు సరిపడా నీటిని అందించడం కాలేజీ యాజమాన్యాలకు సవాలుగా మారింది. నీటి కొరత కారణంగా హాస్టళ్లలో రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలోనూ నీటి కొరత సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నీటి సరఫరా చేసే సమయాన్ని తగ్గించడంతో వర్సిటీ అధికారులు అప్రమత్తమవుతున్నారు. సరఫరా ఇదే విధంగా కొనసాగితే విద్యార్థులు, సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
మొత్తంగా హైదరాబాద్‌లో పెరుగుతున్న నీటి ఎద్దడి విద్యాసంస్థల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు ఈ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ప్రభుత్వం కూడా నగర ప్రజలను నీటి కొరతపై అప్రమత్తం చేస్తోంది. నీటిని వృథా చేయొద్దని స్పష్టం చేస్తోంది.




