బుధవారం సాయంత్రం వినాయకుడిని ఇలా పూజించండి.. అడ్డంకులు తొలగి అదృష్టం కలుగుతుందట!
Wednesday Ganesh Puja Telugu: బుధవారం వినాయకుడి పూజకు ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో గణపతిని 21 గరికెలతో పూజించి, ఉండ్రాళ్లు, మోదకాలు నైవేద్యంగా సమర్పిస్తే విద్య, వ్యాపారంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగి విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మరి బుధవారం సాయంత్రం గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

Wednesday Ganesh Puja Telugu: హిందూ సంప్రదాయంలో వారంలోని ప్రతి రోజుకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ గ్రహాలకు ప్రత్యేక అధిదేవతలు కూడా ఉంటారు. ఈ క్రమంలో బుధవారానికి బుధ గ్రహం అధిపతి కాగా, బుధ గ్రహానికి అధిదేవతగా వినాయకుడిని పరిగణిస్తారు. అందుకే బుధవారం గణపతిని ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. సాధారణంగా చాలామంది ఉదయం నిత్య పూజలో భాగంగా వినాయకుడిని పూజిస్తారు. అయితే బుధవారం సాయంత్రం సంధ్యా సమయంలో ప్రత్యేకంగా గణపతిని ఆరాధించడం మరింత విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. మరి ఈ సమయంలో వినాయకుడిని ఎలా పూజించాలి? ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? ఈ పూజతో ఎలాంటి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారో తెలుసుకుందాం.
విఘ్నాలను తొలగించే వినాయకుడు
హిందూ ధర్మంలో వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా కొలుస్తారు. ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆనవాయితీ. ఆయన అనుగ్రహం ఉంటే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా బుధవారం గణేశుడిని పూజించడం వల్ల బుద్ధి, జ్ఞానం, విద్య, వాక్చాతుర్యం పెరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సాయంత్రం సంధ్యా సమయంలో పూజ ఎందుకు చేయాలి?
సాధారణంగా సాయంత్రం వేళను సంధ్యా సమయంగా పరిగణిస్తారు. పగలు ముగిసి రాత్రి ప్రారంభమయ్యే ఈ సమయంలో దైవారాధన చేయడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. ముఖ్యంగా బుధవారం సంధ్యా సమయంలో గణపతిని పూజించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగి, ప్రతికూల పరిస్థితులను అధిగమించే శక్తి లభిస్తుందని నమ్ముతారు.
బుధవారం సాయంత్రం గణపతి పూజా విధానం
బుధవారం సాయంత్రం పూజకు ముందు శుభ్రంగా స్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి నమస్కరించాలి. ఆ తర్వాత గణపతికి అత్యంత ప్రీతికరమైన గరికతో పూజ చేయాలి.
21 గరికెలు ఎందుకు సమర్పించాలి?
గణపతి ఆరాధనలో 21 గరికెలకు ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయం ప్రకారం వినాయకుడికి 21 గరికెలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సంఖ్య వెనుక ఆధ్యాత్మిక అంతరార్థం ఉందని చెబుతారు. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు పంచభూతాలు, ఐదు ప్రాణాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, మూడు గుణాలైన సత్వ, రజో, తమో గుణాలు కలిపి మొత్తం 21 అవుతాయి. వీటన్నింటినీ భగవంతుడికి సమర్పిస్తున్నామనే భావనతో 21 గరికెలను అర్పిస్తారు.
వినాయకుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి?
గరిక పూజ అనంతరం గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించాలి. ఆ తర్వాత వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదకాలు, అరటిపండ్లు, కొబ్బరికాయలను నైవేద్యంగా సమర్పించాలి. చివరగా గణేశుడికి మంగళహారతి ఇచ్చి పూజను ముగించాలి.
ఈ పూజతో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?
బుధవారం సంధ్యా సమయంలో గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల విద్యాభ్యాసంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగుతాయని విశ్వసిస్తారు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారని నమ్మకం. వ్యాపారులకు అభివృద్ధి, ఉద్యోగులకు వృత్తిపరమైన పురోగతి కలుగుతాయని చెబుతారు. అంతేకాకుండా కుటుంబంలో విభేదాలు తగ్గి ప్రశాంతత నెలకొంటుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి బుధవారం సాయంత్రం కొద్దిసేపు గణనాథుడి ఆరాధనకు కేటాయించి, భక్తితో పూజలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.
(Disclaimer: ఈ కథనంలోని విషయాలు హిందూ సంప్రదాయాలు, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించిన వివరాలు మాత్రమే. పూజా ఫలితాలు వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినవి.)




