కొత్త సంవత్సరం సమీపిస్తోన్న వేళ వ్యసనపరులకు, అక్రమ దుకాణాలకు చెక్ పెడుతున్నారు సిటీ పోలీసులు. ఈ నేపథ్యంలో పలు చోట్ల దాడులు చేస్తూ మత్తులో తేలుతోన్న యువతను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా చంద్రాయణగుట్ట పోలీస్ పరిధిలోని బండగూడలోని నాహది హుక్కా సెంటర్‌పై పోలీసులు మెరుపు దాడులు చేశారు. సుమారు 40మంది యువతను అదుపులోకి తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా యువతను మత్తులోకి దింపి సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులను సైతం అరెస్ట్ చేశారు.
ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల యువకులను టార్గెట్ చేసి నడుస్తోన్న నాహది హుక్కా సెంటర్‌పై గతంలోనూ క్రిమినల్ కేసులు ఉన్నాయి. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు హుక్కా సెంటర్‌పై దాడి చేశారు. ప్రమాదకరమైన ఫ్లేవర్స్‌తో మత్తు పదార్థాల అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 40మంది యువకులను అరెస్ట్ చేసి.. 40 హుక్కా తాగే పరికరాలు, 30 హుక్కా ఫ్లేవర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడ్డ వారిలో మైనర్లు కూడా ఉన్నారు. దీంతో వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీసులు చెప్పారు. నగరంలో నిబంధనలను విరుద్ధంగా నడుస్తోన్న హుక్కా సెంటర్లపై తాము ఉక్కుపాదం మోపుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.