దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్సలో వినియోగిస్తున్న యాంటీవైరల్ డ్రగ్ రెమ్డిసివిర్‌కు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డోసేజీ ప్రోటోకాల్‌లో మార్పులు చేస్తూ ఓ సర్క్యులర్ జారీ చేసింది. తాజా మార్గదర్శకాలు ప్రకారం.. మందును వరుసగా ఐదు రోజుల పాటు రోగికి ఇవ్వాలి. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ ముందును తొలి రోజున 200 మిల్లీగ్రాములు ఇవ్వాలి. మిగిలి నాలుగు రోజుల్లో 100 మిల్లీగ్రాముల చప్పున ఇవ్వాలి.
కోవిద్-19 వ్యాధి లక్షణాలు మధ్యస్థాయిలో ఉండి, బయటినుంచి ఆక్సిజన్ అందించాల్సిన రోగులకు రెమ్డిసివిర్ వినియోగించేందుకు జూన్ 13న కేంద్రం అనుమతించిన విషయం విదితమే. అయితే కిడ్నీ సంబందిత సమస్యలున్న వారు, గర్భిణులు, పసిపిల్లలున్న తల్లులు, 12 ఏళ్లు లోపు వయసున్న చిన్నారులకు మాత్రం ఈ మందు ఇవ్వకూడదని కూడా అప్పట్లో తెలిపింది. ప్రయోగాత్మక చికిత్సలు కింద రెమ్డిసివిర్‌కు అనుమతిచ్చింది.
కరోనా కట్టడికోసం రెమ్డిసివిర్‌తో పాటు డెక్సామెథాజోన్, ఫెవిపిరావిర్ మందులకు కూడా కేంద్రం అనుమతిచ్చింది. కరోనా తీవ్రంగా ఉన్న వారికి డాక్టర్లు డెక్సామెథాజోన్ సూచిస్తుండగా..వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో ఫెవిపిరావిర్‌ను వినియోగిస్తున్నారు. అయితే వీటిని కూడా కేంద్రం ప్రయోగాత్మక చికిత్సలుగానే గుర్తించింది.