అవిసె గింజలతో ఇంట్లోనే కొల్లాజెన్ సీరమ్.. ముడతలు మాయం.. చర్మం మెరిసిపోవడం ఖాయం!
వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు, మచ్చలు రావడం సహజం. అయితే ఖరీదైన కొల్లాజెన్ ప్రొడక్ట్స్, యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు వాడాల్సిన పనిలేకుండా, ఇంట్లోనే లభించే అవిసె గింజలతో సహజసిద్ధమైన కొల్లాజెన్ సీరమ్‌ను తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఈ సహజసిద్ధమైన క్రీమ్ చర్మానికి మంచి మెరుపును అందించడమే కాకుండా ముడతలను నివారిస్తుంది.

వయసు పైబడే కొద్దీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి, చర్మం సాగిపోవడం, ముడతలు పడటం, గీతలు రావడం మొదలవుతాయి. చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో కొల్లాజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం మార్కెట్లో దొరికే రసాయనాలు కలిసిన సీరమ్‌లు, క్రీమ్‌లపై వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో అందుబాటులో ఉండే అవిసె గింజలతో అత్యంత ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్ కొల్లాజెన్ సీరమ్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.
అవిసె గింజలలోని ప్రయోజనాలు:
అవిసె గింజలు పోషకాల గని. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, లిగ్నాన్స్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి లోతైన తేమను అందించి, చర్మ కణాలను పునరుద్ధరిస్తాయి. అలాగే ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను సడలించకుండా బిగుతుగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
సీరమ్ తయారీకి కావలసిన పదార్థాలు:
అవిసె గింజలు – 2 స్పూన్లు
నీళ్లు – 1 గ్లాసు
అలోవెరా జెల్ – 1 స్పూన్
బాదం నూనె (లేదా కొబ్బరి నూనె) – అర స్పూన్
విటమిన్-E క్యాప్సూల్ – 1
తయారీ విధానం:
ఒక పాత్రలో గ్లాసు నీళ్లు పోసి, అందులో రెండు స్పూన్ల అవిసె గింజలను వేసి సన్నని మంటపై మరిగించాలి. నీరు చిక్కబడి జెల్ లాగా మారేంత వరకు (సుమారు 5-7 నిమిషాలు) ఉడికించాలి. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే కాటన్ గుడ్డ లేదా వడపోత జాలీ సహాయంతో జెల్‌ను వేరు చేసుకోవాలి. ఈ జెల్ చల్లారిన తర్వాత అందులో అలోవెరా జెల్, బాదం నూనె, విటమిన్-E క్యాప్సూల్ ఆయిల్ వేసి బాగా కలపాలి. సిద్ధమైన ఈ క్రీమ్‌ను శుభ్రమైన గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచితే 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఎలా ఉపయోగించాలి?:
రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, ఈ సీరమ్‌ను ముఖం, మెడపై వృత్తాకారంలో నిమ్మదిగా మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు, గీతలు తగ్గి, చర్మం బిగుతుగా మారి సహజ సిద్ధమైన కాంతిని సంతరించుకుంటుంది.




