AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెండకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..? అసలు నిజాలు తెలుసుకోండి..

బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని చిన్నప్పుడు ఇంట్లో వాళ్లు పెడుతుంటే.. అదే సమయంలో గింజలు మింగితే కడుపులో రాళ్లు వస్తాయి, అపెండిసైటిస్ వస్తుంది అంటూ భయపెట్టడం అందరికీ అనుభవమే. ఈ భయంతో ఇప్పటికీ చాలామంది కూరల్లోని గింజలను ఏరి పారేస్తుంటారు. కానీ ఈ మాటల్లో నిజమెంత? బెండకాయ గింజలు నిజంగానే కడుపులో తిష్టవేస్తాయా లేక సైన్స్ ఇంకేదైనా చెబుతోందా? అనే విషయాలు తెలుసుకుందాం..

బెండకాయ గింజలు తింటే కడుపులో ఏమవుతుంది..? అసలు నిజాలు తెలుసుకోండి..
Do Lady's Finger Seeds Cause Appendicitis
Krishna S
|

Updated on: Oct 05, 2026 | 9:05 PM

Share

తెలుగువారి వంటింట్లో బెండకాయకు ప్రత్యేక స్థానం ఉంది. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, మజ్జిగ చారు.. ఇలా ఏ రూపంలో వండినా లొట్టలేసుకుంటూ తింటారు. బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని పెద్దలు చెబుతుంటారు. అయితే అదే సమయంలో బెండకాయలోని తెల్లటి గింజలను నమలకుండా మింగితే అపెండిసైటిస్ వస్తుందని, కడుపులో రాళ్లుఏర్పడతాయని చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, నానమ్మల నుంచి వింటూనే ఉంటాం. ఈ భయంతో ఇప్పటికీ కొందరు బెండకాయ గింజలను తీసేసి వండటం లేదా తినేటప్పుడు పక్కన పెట్టడం చేస్తుంటారు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? బెండకాయ గింజలు తింటే నిజంగానే అనారోగ్య సమస్యలు వస్తాయా? వైద్యులు, పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవడం ముఖ్యం.

ఆ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు..

వైద్య నిపుణుల ప్రకారం.. బెండకాయ గింజలు తింటే అపెండిసైటిస్ వస్తుందనే దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది కేవలం సమాజంలో తరతరాలుగా వస్తున్న ఒక అపోహ మాత్రమే. ఇతర కూరగాయల మాదిరిగానే బెండకాయ గింజలు కూడా మన సాధారణ జీర్ణ ప్రక్రియ ద్వారా తేలికగా జీర్ణమవుతాయి లేదా శరీరం నుండి విసర్జించబడతాయి. వీటివల్ల శరీరానికి ఎటువంటి ముప్పు వాటిల్లదు.

బెండకాయ గింజల్లో దాగున్న పోషకాల గని

నిజానికి బెండకాయ గుజ్జు కంటే దాని లోపల ఉండే గింజల్లోనే అద్భుతమైన పోషకాలు దాగి ఉన్నాయి.

ఫైబర్ : బెండకాయ గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు: శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, కణాల డ్యామేజ్‌ను అరికట్టడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

గుడ్ ఫ్యాట్స్ – ప్రొటీన్: శరీర ఆరోగ్యానికి మేలు చేసే నాణ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ గింజల ద్వారా సహజసిద్ధంగా లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలోనూ ఇవి సహాయపడతాయి.

సమస్య ఎప్పుడు ఎదురవుతుంది?

బెండకాయ గింజలు సాధారణ ప్రజలకు పూర్తి సురక్షితమైనవే అయినప్పటికీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం జాగ్రత్త అవసరం. జీర్ణవ్యవస్థ బాగా బలహీనంగా ఉన్నవారు, తీవ్రమైన ఐబీఎస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు వీటిని అధికంగా తీసుకుంటే కడుపుబ్బరం లేదా గ్యాస్ వంటి చిన్నపాటి అసౌకర్యం కలగవచ్చు. అలాగే కిడ్నీలో ఆక్సలేట్ రాళ్లు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచన మేరకు బెండకాయను మితంగా తీసుకోవడం మంచిది.

కాబట్టి బెండకాయ గింజలను చూసి అనవసరంగా భయపడాల్సిన పనేలేదు. ఎటువంటి అనుమానాలు లేకుండా బెండకాయను మీ రోజువారీ ఆహారంలో భాగంగా నిశ్చింతగా ఆస్వాదించవచ్చు. అయితే ఏ ఆహారమైనా సమతుల్యంగా, మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి అసలైన ఆరోగ్య సూత్రం.

Follow Us