రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? గుండె ఆరోగ్యానికి పొంచి ఉన్న పెద్ద ముప్పు ఇదే!
ఆధునిక జీవనశైలి, లేట్ నైట్ షిఫ్ట్‌లు, స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల చాలామంది రాత్రిపూట ఆలస్యంగా డిన్నర్ చేస్తుంటారు. కానీ రాత్రి 8 లేదా 9 గంటల తర్వాత భోజనం చేయడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె సురక్షితంగా ఉండాలంటే నిద్రపోవడానికి రాత్రి నిద్రకు ఎన్ని గంటల ముందు భోజనం పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం..

రాత్రిపూట ఆలస్యంగా జేవనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా గుండె ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని కార్డియాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో సహజ సిద్ధమైన జీవ గడియారం దెబ్బతింటుంది. గుండె సురక్షితంగా ఉండాలంటే నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే తేలికపాటి భోజనం పూర్తి చేయడం ఎంతో శ్రేయస్కరం. మరిన్ని డిటెల్స్ ఇప్పుడు చూద్దాం..
1. బయోలాజికల్ క్లాక్ సమతుల్యత దెబ్బతినడం:
మన శరీరానికి సహజమైన జీవ గడియారం ఉంటుంది. రాత్రి వేళల్లో శరీరం విశ్రాంతి దశకు చేరుకుంటుంది, ఆ సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకోకుండా ఆహారాన్ని జీర్ణం చేయడానికి శ్రమించాల్సి వస్తుంది.
2. బ్లడ్ ప్రెజర్ (BP), షుగర్ లెవెల్స్ పెరుగుదల:
సాధారణంగా రాత్రి సమయంలో రక్తపోటు (BP) తగ్గుతుంది, దీనిని నైట్-టైమ్ డిప్పింగ్ అంటారు. అయితే లేట్ నైట్ డిన్నర్ వల్ల రాత్రి వేళల్లో బిపీ తగ్గకుండా పెరిగి ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో ఇన్సులిన్ పనితీరు మందగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది.
3. చెడు కొలెస్ట్రాల్, బరువు పెరగడం:
రాత్రివేళల్లో కొవ్వును కరిగించే జీవక్రియ నెమ్మదిస్తుంది. ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్లు రక్తనాళాల్లో పేరుకుపోయి, గుండె ధమనులు మూసుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. ఇది క్రమంగా గుండెపోటు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
4. నిద్రలేమి, యాసిడ్ రిఫ్లక్స్:
భారీగా తిని వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం తలెత్తుతాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు పెరిగి గుండెపై మరింత ఒత్తిడి పడుతుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు:
నిద్రపోవడానికి 2 నుంచి 3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి. రాత్రిపూట కొవ్వులు, నూనెలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. తేలికగా అరిగే ప్రోటీన్, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం గుండెకు శ్రేయస్కరం.




