రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానికి ఆత్యాధునిక విమానాలు

భారత దేశాధినేతలు ప్రయాణించేందుకు శత్రు దుర్బేధ్యమైన మూడు విమానాలు దేశానికి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్న బోయింగ్ 777-300 ఈఆర్ విమానాల్లో.. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్‌కు ధీటుగా విలక్షణ రక్షణ సదుపాయాలు ఉన్నాయి.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానికి ఆత్యాధునిక విమానాలు
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 02, 2020 | 10:44 AM

అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలకు వెళ్లిన ప్రతిసారి మేఘాలను చీల్చుకుంటూ దూసుకొచ్చే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. దాదాపు అంతకుమించి.. తాజాగా భారత దేశాధినేతలు ప్రయాణించేందుకు శత్రు దుర్బేధ్యమైన మూడు విమానాలు దేశానికి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్న బోయింగ్ 777-300 ఈఆర్ విమానాల్లో.. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్‌కు ధీటుగా విలక్షణ రక్షణ సదుపాయాలు ఉన్నాయి.

దేశంలోని ముగ్గురు వీవీఐపీలు… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తరచూ ప్రయాణించే విమానాల జాబితాలో అత్యాధునిక విమానాలు చేరాయి. ప్రముఖులు మాత్రమే ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్‌ ఇండియా వన్‌ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్‌–777 విమానం అమెరికాలోని టెక్సాస్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ విమానం దేశ రాజధానిలో ల్యాండ్ అయ్యినట్లు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ విమానంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచూ ప్రయాణించనున్నారు. దేశంలోని ప్రముఖులు మాత్రమే ప్రయాణించడానికి వీలుగా డిజైన్‌ చేశారు. యుద్ధాలను దృష్టిలోకి ఉంచుకుని తయారు చేసిన ఈ విమానంలో అణుదాడిని సైతం తట్టుకోగల సాంకేతిక పరిజ్ఞానాన్నితో రూపొందించారు. శత్రు దుర్బేధ్యం కలిగిన టెక్నాలజీతో ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్‌లో బోయింగ్‌ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. రెండో విమానం మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ విమానంపై భారత్‌ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. గత జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఎయిర్‌ఇండియా వన్‌ కాల్‌ సైన్‌తో బోయింగ్‌ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ (ఎండీఎస్‌)తో పాటు శక్తిమంతమైన ఈడబ్ల్యూ జామర్‌, మిర్రర్‌ బాల్‌ ఈక్వలెంట్‌ సిస్టం, క్షిపణి హెచ్చరిక వ్యవస్థ వంటి ఎన్నో సదుపాయాలున్న ఈ విమానాల్లో మరిన్ని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం..

ప్రత్యేకతలివీః

► ఎయిర్‌ ఇండియా వన్‌ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు.

► ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రేర్డ్‌ కౌంటర్‌మెజర్స్‌ (ఎల్‌ఏఐఆర్‌సీఎం), సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్స్‌ (ఎస్‌పీఎస్‌)ను అమర్చారు.

► అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్‌ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్‌ ఫ్రీక్వెన్సీని జామ్‌ చెయ్యగలదు. క్షిపణుల్ని విమానం వైపు రాకుండా దారి మళ్లించగలదు.

► అమెరికా నుంచి భారత్‌ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఇంధనం నింపడానికి కూడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది.

► కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

► విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి.

►ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్‌ కమాండ్‌ సెంటర్‌ మాదిరి పనిచేస్తుంది.

► ఈ విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది.

► ఈ విమానాలను ఎయిర్‌ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన పైలట్లు మాత్రమే నడుపుతారు.

► ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు.