గండికోట రహస్యం… వెలుగులోకి రాని సంపద లక్షల కోట్లల్లోనే
గండికోట. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కడప జిల్లా జమ్మలమడుగుకు 14 కి.మీ దూరంలో ఉందా కోట. ఎత్తైన కొండపై నిర్మించిన శతృుదుర్బేధ్య దుర్గం. ఇక్కడి ఎర్రమల కొండలను పెన్నానది రెండుగా చీల్చుకుంటూ
గండికోట. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. కడప జిల్లా జమ్మలమడుగుకు 14 కి.మీ దూరంలో ఉందా కోట. ఎత్తైన కొండపై నిర్మించిన శతృుదుర్బేధ్య దుర్గం. ఇక్కడి ఎర్రమల కొండలను పెన్నానది రెండుగా చీల్చుకుంటూ ప్రవహిస్తుంటుంది. అలా వెళుతున్నప్పుడు పెద్ద గండిలా ఈ ప్రాంతం కనపడుతోంది. ఐదు మైళ్ల వరకు ఈ గండి ఉంటోంది. అందుకే ఈ ప్రాంతానికి గండికోట అనే పేరు వచ్చింది. సముద్రమట్టానికి 1670 అడుగుల ఎత్తులో నిర్మించిన అద్బుత కట్టడం గండికోట. చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజుకు సామంత రాజుగా ఉన్నాడు కాకరాజు. ఆయనే క్రీ.శ 1123 జనవరి 9న గండికోటను నిర్మించినట్లు గ్రామ కైఫియత్తుల ద్వారా తెలుస్తోంది. ఈ కోట ఎన్నిసార్లు శత్రువుల దాడులకు గురైనా నేటికి సజీవంగా ఉంది. ఇందుకు కారణం కోట చుట్టుపక్కల ఉన్న రాయినే. 1700 నుంచి 2600 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన క్వార్జైట్ రాయి కావడమేనని భూ భౌతిక శాస్త్ర వేత్తల అంచనా. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, పెమ్మసాని వంశీయులు, నవాబులు, ఆంగ్లేయుల పాలనలలో గండికోట సాంస్కృతిక వైభోగాలతో పాటు ఎన్నో యుద్దాలకు సాక్షి భూతంగా నిలిచింది. చరిత్రలో మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. భావి తరాలు చెప్పుకునేందుకు వేదికైంది.
గండికోటలో గత పది రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు. అభివృద్ధి పనుల కోసమే ఈ పని చేస్తున్నా..విలువైన వస్తు సంపద ఒక్కటొక్కిటిగా బయటకొస్తుంది. చరిత్ర ప్రసిద్ది గాంచిన పురావస్తు ఆధారాలు. చారిత్రక అవశేషాలు. నేలమాళిగలు. ఫిరంగిగుండ్లు, ఆనాటి మానవుడు వాడిన ఎన్నో వస్తు పరికరాలు వెలుగు చూస్తున్నాయి. ఆనాటి రాచరిక పాలన ఆనవాళ్లు తెలుస్తున్నాయి. శిధిలదుర్గంలో నిక్షిప్తమై ఉన్న అపారమైన, అపురూపమైన చారిత్రక సంపదకు కొదవేం లేదు. అందమైన లోయలు, పకృతి కమనీయమైన అబ్బురపరిచే దృశ్యాలు ఇక్కడున్నాయి. అందుకే అందరి చూపు కడప జిల్లా గండికోటపై పడింది. అమెరికాలోని గ్రాండ్ కెనాన్ కంటే ఈ కట్టడం గొప్పదని చరిత్రకారుల వర్ణన. అక్కడి గ్రాండ్ కెనాన్ లో నీళ్లు లేవు. కానీ ఇక్కడ సంవృద్దిగా నీరుండటం విశేషం. చాళుక్య, కాకతీయ, విజయనగర, పెమ్మసాని వంశీకుల పాలనలో గండికోట సాంస్కృతిక, సౌరభాలతో విరాజిల్లింది. హిందూ రాజుల పరిపాలనా కాలంలో ఈ కోటలో రంగనాయకులు, మాధవరాయస్వామి, వెంకటరమణుడు, నరసింహుడు, చెన్నకేశవుడు, నమ్మళ్వారు, హనుమంతుని ఆలయాలు నిర్మించినట్లు కోట చరిత్రను పరిశోధించిన పురావస్తు నిపుణులు అంచనా. ఇప్పటికీ ఈ ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు గండికోటలో కన్పిస్తాయి. విజయనగర రాజుల కాలంలో గండికోట రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లింది. ఈ దుర్గం అన్ని అనుకూలతలుగల నివాసయోగ్య ప్రాంతం. ఈ కోటను ఆక్రమించుకునే క్రమంలో మరెన్నో సంఘటనలు జరిగాయి.
పునాదులు లేని కోట
పునాదులు లేకుండానే కొండబండలపై కోట గోడలను నిర్మించడం ఓ ప్రత్యేకత. కోట చుట్టురా 101 బురుజులు, ప్రవేశ ద్వారమే కాక, ఐదు రహస్య మార్గాలు ఒక సొరంగ మార్గం కూడా ఉంది. దక్షిణ భారత దేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో గోల్కోండ నవాబు అబ్దుల్ కులీ కుతుబ్ షా సైన్యాధికారి మీర్ జుమ్లా ఇటువైపు వచ్చాడు. క్రీ.శ 1652 ఆగస్టు 25న పెమ్మసాని చిన్న తిమ్మనాయుడు నుంచి కోటను కుట్రతో స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి గండికోట వైభవం క్షీణిస్తూ వచ్చింది. మీర్ జుమ్లా కోటలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేయించాడు. ఇక్కడున్న విగ్రహాలను కరిగించి ఫిరంగుల తయారీకి వినియోగించారు. గండికోట సీమలో లభించే వజ్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. అంతటి ఘన చరిత్ర ఉన్న గండికోట ఎనలేని ఐశ్వర్యాన్ని పోగు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆలయాలను, శిల్ప కళాసంపదను ధ్వంసం చేసిన నవాబు పాలకులు మసీదులను, మీనార్ లను నిర్మించారు. గండికోటలోని నిర్మాణాలను అద్భుత కట్టడాలుగా పరిగణిస్తారు. నగారాఖానా, చార్ మీనార్, కారాగారం, ఎర్రకోనేరు, జుమ్మా మసీదు, ధాన్యాగారం, రాజదర్బార్, రంగమహల్ ఆయుధ కర్మాగారం, రంగసాని ఊయలమంటపం నిర్మాణాలు అలనాటి శిల్ప కళా చాతుర్యానికి మచ్చు తునకలు.
కరవు, కాటకాలు వచ్చే ప్రాంతం కావడంతో ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు పెద్ద సంఖ్యంలో నేలమాళిగలు నిర్మించారు. ఇక్కడి ఆయుధాగారంలో ఫిరంగులు, తుపాకులు, శూలాలు, ఖడ్గాలు, డాళ్లు, మందుగుండు సామాగ్రి తయారు చేసేవాళ్లు. యుద్ద సమయంలో కోటను లోపల ఉన్నా..ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పట్లోనే ఏర్పాట్లు చేశారు. కోట దిగ్భంధం చేసిన సమయంలో నెలల తరబడి కోటలోని రాజపరివారానికి ఇతరులకు తాగునీటి అవసరాల కోసం నిర్మించిన రాయలచెరువు నేటికి రైతుల సాగునీటి అవసరాలు తీరుస్తోంది. గండికోట 1791 లో టిప్పు సుల్తాన్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. ఆ తర్వాత పూర్తిగా ప్రాభవం కోల్పోయింది. మొత్తం ఉన్న 31 ఫిరంగులు ఇక్కడ ఉన్నాయని చెబుతారు. వాటిలో రెండింటిని మాత్రమే ఉంచి మిగిలిన 29 ఫిరంగులు, ఫిరంగిగుండ్లను కరిగించి ఇనుమును తరలించుకు వెళ్లారని చరిత్ర చెబుతోంది.
భారత్ కు స్వాతంత్రం వచ్చాక కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్లి గండికోట. ప్రపంచ పర్యాటక కేంద్రంగా గండికోటను గుర్తించారు. అయినా ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదు. అరుదైన శిల్ప, కళాఖండాలు, అలనాటి రాచరిక పాలనకు ప్రతీకగా ఉన్న సంపద చోరికి గురైంది. ఇప్పుడు గండికోట కళావిహీనమైంది. గండికోట వారసత్వ సంపదను పరిరక్షించుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గండికోట ఉత్సవాలను నిర్వహిస్తున్నప్పటికీ, అరుదైన సంపదను పరిరక్షించుకునేందుకు కేంద్ర రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు పూర్థి స్తాయి చర్యలు చేపట్టలేదనే చెప్పాలి.
వెలుగులోకి సంపద
ఇటీవల గండికోటలోని పెద్ద కోనేరు పరిసర ప్రాంతాలలో తవ్వకాలు జరిపారు. అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు పురావస్తుశాఖ జరిపిన త్రవ్వకాలలో నేలమాళిగల తరహాలో ఉన్న రెండు ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఆతర్వాత మరో చోట చదును చేస్తుండగా… 8 ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. ఫలితంగా గండికోట మరోసారి వార్తల్లోకి వచ్చింది. కోటలో ఉన్న అపరూప సంపద అలనాటి ఆనవాళ్లు ఇంకా భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. పెన్నా, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలలో ఉన్న గనుల్లో లభించే వజ్రాలను గండికోట కేంధ్రంగా సేకరించి విదేశాలకు ఎగుమతి చేసేవారనేది చరిత్ర చెబుతోంది. అలాగే గండికోటలో నాణేలను ముద్రించేందుకు టంకశాల కూడా ఉండేదని కల్నల్ మెకంజీ రూపొందించిన గ్రామ కైఫీయెత్తుల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల పాలనలో గండికోట వరహా, గండికోట అర్థ వరహాల పేరుతో బంగారు, వెండి, రాగి నాణేలను ముంద్రించేవారని ఇవే చలామణీలో ఉండేవని తెలుస్తోంది.
వజ్ర వైఢుర్యాలున్నాయి…
నిజాం నవాబు మీర్ జుమ్లా గండికోటపైకి దాడికి వచ్చినప్పుడు అక్కడ 12 ఏళ్లకు సరిపడా ఆహార పదార్థాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు సిద్దంగా ఉన్నాయని చెబుతారు. యుద్దం చేస్తామే కానీ లొంగిపోమంటూ మీర్ జుమ్లాకు కోట వాసులు వర్థమానం పంపినట్లు చరిత్ర చెబుతోంది. అన్ని అవసరాలకు సరిపడా వస్తు సామాగ్రిని నిల్వ ఉంచేందుకు పెద్ద సంఖ్యలో నేలమాళిగలు నిర్మించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం అవన్నీ భూగర్భంలో నిక్షిప్తిమై ఉన్నాయి. మరికొన్నిచోట్ల తవ్వకాలు జరిపితే వజ్ర వైఢుర్యాలు, రత్న మాణిక్యాలు బయట పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇవన్నీ వెలుగులోకి రావాలంటే కేంద్ర పురావస్తుశాఖ ప్రత్యేక త్రవ్వకాలు జరపాల్సి ఉంది. ఇటీవల జరిగిన త్రవ్వకాల్లో ధాన్యాగారాలు, ఫిరంగి గుండ్లు బయటపడ్డాయి. అయినా పురావస్తుశాఖ అధికారులు గండికోటను సందర్శించిన దాఖలాలు లేవనే చెప్పాలి. గండికోట వైభవానికి ఆనవాళ్లుగా మిగిలిన అనేక శిల్పాలు, ఖడ్గాలు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. కాకపోతే అవి ఇక్కడ కాకుండా మైలవరం, చంద్రగిరి మ్యూజియాల్లో భద్రపరిచారు. మరికొన్ని మద్రాసులోని ఎగ్మూర్ మ్యూజియంలో మరికొన్ని ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో చోటు చేసుకున్నాయి. ఎంతో విలువైన చరిత్రకు సాక్షి భూతంలా నిలిచిన గండికోటలో మరిన్ని తవ్వకాలు జరిపితే భావి తరానికి అవసరమైన విశేషాలు, వస్తు సంపద వెలుగులోకి వచ్చే వీలుంది. గండికోట పరిసర గ్రామాల నుంచి సేకరించిన పురాతన విగ్రహాలు, కత్తులు, నవాబులు ఉపయోగించిన హుక్కా లాంటి పరికరాలను మైలవరం పురావస్తుశాఖ మ్యూజియంలో చూడవచ్చు. అంతే కాదు… అపురూపమైన రంగనాయకుల స్వామి విగ్రహాం, అరుదైన శిల్పాలు, ఆళ్వారుల ప్రతిమ ఆ కాలంలో చలామణీలో ఉన్న నాణేలు, 39 ఖడ్గాలు ఈ మ్యూజియంలో భద్రపరిచారు. పురావస్తుశాఖ పర్యవేక్షణ కొరవవడంతో కోటలో గుప్తనిధుల కోసం త్రవ్వకాలు బాగానే జరుగుతున్నాయి. గండికోటను పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గండికోటలో వసతుల కల్పనతో పాటు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అపురూప సంపదను వెలికి తీస్తే రాష్ట్ర బడ్జెట్ కు లోటు ఉండదంటారు. అంతగా కోటలోని పలు ప్రాంతాల్లో రహస్య సంపద దాచి పెట్టారని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికేనా ప్రభుత్వం ఆ దిశగా తవ్వకాలు జరుపుతుందా లేక అలానే వదిలేస్తుందా అనేది వేచి చూడాలి.
కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9