Budget 2021: ‘వాటికి ప్రాధాన్యత ఇస్తేనే దేశం ఆర్థికంగా ముందుకెళుతోంది’.. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో ఆర్థిక నిపుణుల సూచన..

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వస్తోన్న బడ్జెట్‌-2021పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. పతనమైన భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానకి కేంద్రం ఎలాంటి ప్యాకేజీలు ప్రకటిస్తుంది. జీవనోపాధి కోల్పోయిన...

Budget 2021: 'వాటికి ప్రాధాన్యత ఇస్తేనే దేశం ఆర్థికంగా ముందుకెళుతోంది'.. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో ఆర్థిక నిపుణుల సూచన..
Follow us
Narender Vaitla

| Edited By: Team Veegam

Updated on: Jan 22, 2021 | 4:38 PM

Expert Opinion On Budget 2021: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని వణికించింది. అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆర్థికంగా ఎంతో శక్తివంతమైన దేశాలు కూడా ఈ వైరస్‌ దాడికి తట్టుకోలేకపోయాయి. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఒకటైన భారత ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడిందనే చెప్పాలి. సుమారు నెలన్నర రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటోన్నా… కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వస్తోన్న బడ్జెట్‌-2021పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. పతనమైన భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానకి కేంద్రం ఎలాంటి ప్యాకేజీలు ప్రకటిస్తుంది. జీవనోపాధి కోల్పోయిన చిరు ఉద్యోగులకు ఎలాంటి భరోసానిస్తోందన్న చర్చలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఎప్పటిలా ముందుకెళ్లాలంటే బడ్జెట్‌లో కచ్చితంగా పొందు పరచాల్సిన అంశాలపై ఆర్థిక రంగ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఈసారి బడ్జెట్‌ రూపొందించడంలో పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే కచ్చితంగా ఉద్యోగకల్పన భారీ ఎత్తున జరగాలనేది నిపుణుల వాదన. ఒక అంచనా ప్రకారం భారత్‌లో 2030 వరకు ప్రతి ఏడాది ఏటా కోటి కొత్త ఉద్యోగాల కల్పన జరగాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది బడ్జెట్‌లో ఆరోగ్య రంగంతో పాటు నిర్మాణ రంగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఉపాధి కల్పనలో నిర్మాణ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఇంటి నిర్మాణాలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సైతం లభిస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థ బలపడడంలో ఇది ఉపయోగపడుతుంది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన్‌ పథకాన్ని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్మాణ రంగంపై ప్రీమియంను 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది దీనివల్ల అక్కడ స్టాంప్‌ డ్యూటీ బాగా పెరిగింది. దీనర్థం ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తే అది కచ్చితంగా నిర్మాణ రంగంపై సానుకూల ప్రభావం చూపుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి రాయితీలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. సంక్షోభ సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ సామాన్యుడికి ఎంత వరకు మేలు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్‌ సాక్షిగా బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.

Also Read: బడ్జెట్ 2021-పన్నుల వ్యవస్థలో కేంద్రం మార్పులు చేస్తుందా ? ప్రత్యక్ష, పరోక్ష పన్నులంటే ? నిర్మల బడ్జెట్ ఎలా ఉంటుంది?