Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఏకైన కూతురు స్వప్ని రెడ్డి, అర్జున్ రెడ్డి వివాహం ఈనెల 12న రాత్రి ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. కుటుంబసభ్యులు, పలువురు ఇతర ప్రముఖుల సమక్షంలో పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. బాలిలో జరిగిన పెళ్లి వేడుకకు తనకు అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులు.. దాదాపు 5 వందల మందిని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లారు పొంగులేటి. ఇక.. ఈ బుధవారం ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో.. దాదాపు 150 ఎకరాల్లో.. బాహుబలి రేంజ్‌లో భారీ సెట్టింగ్స్‌తో.. వివాహ రిసెప్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
25 ఎకరాల్లో.. రాజస్థాన్ ప్యాలెస్‌ను మించేలా.. రిసెప్షన్ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలనాటి రాజసం ఉట్టిపడేలా.. ఆకట్టుకునే వస్తువులతో వేదికను డెకరేట్ చేశారు. అందమైన పూలు, ఫౌంటేన్‌లతో.. అబ్బురపరిచేలా అలంకరణ చేశారు.
దాదాపు మూడు నెలలు, 400 మంది వర్కర్లు కష్టపడి.. ఈ వేదికను తీర్చిదిద్దారు. హైదరాబాద్, విశాఖ, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి మెటీరియల్‌ను తెప్పించి.. స్పెషల్‌గా వాటర్ ఫౌంటేన్‌లు, రంగు రంగుల ప్లవర్స్‌తో చేసిన అలంకరణ అందర్నీ ఆకట్టుకుంది. విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్న వేదికను చూసిన స్థానికులు ఔరా అంటున్నారు. ఈ రిసెప్షన్ వేదికకు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వేదికకు స్పెషల్ జర్మన్ హ్యాంగర్‌ను వేశారు. ఎక్కడా లేని విధంగా సివిల్ ప్లాట్ పామ్ వర్క్ చేశారు.
వర్షాకాలం కావడంతో ప్రత్యేకంగా టెంపరరీ వాటర్‌ప్రూప్ షెడ్లను నిర్మించారు. అచ్చం రాజస్థాన్ ప్యాలెస్‌లా.. ఈ రిసెప్షన్ వేదికను తయారు చేసి.. పొంగులేటి రిసెప్షన్ సందడి.. నభూతో నభవిష్యత్ అనేలా జరిగింది.
ఇక.. అతిధులకు విందు ఏర్పాట్లు అదరహో అన్నట్లుగా సాగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల ఆహ్వానాలు ఇంటింటికి అందించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ విందుకు పొంగులేటి అనుచరులు, అభిమానులు, ప్రజా ప్రతినిధులతో… దాదాపు మూడు లక్షల మందికిపైగా హాజరయ్యారు. 25 ఎకరాల్లో.. 17 భోజన వేదికలను ఏర్పాటు చేశారు. వీఐపీలు, మహిళల కోసం ప్రత్యేక భోజన వేదికలు సిద్ధం చేశారు. తెలంగాణ వంటల్లో ప్రత్యేకత ఉన్న యాదమ్మ ఆధ్వర్యంలో.. దాదాపు 200 మంది పనిచేశారు. మొత్తం 20 రకాల వంటకాలు అతిథులకు వడ్డించారు. స్వీట్, అరిసె, చికెన్ కర్రీ మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, రొయ్యలు, కుండ పెరుగు, సాంబారు, పెరుగు చట్నీ, ధమ్ బిర్యానీ , గోంగూర చట్నీ లాంటి.. నోరూరించే, ఘుమఘుమ లాడే వంటాలు అందించారు.
అలానే.. వేలల్లో వచ్చే వాహనాలకోసం.. 100 ఎకరాల్లో పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు. దాదాపు 60 వేల కార్లు పార్క్ చేసేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. వర్షాకాలం కావడంతో ప్రత్యేకంగా టెంపరరీ వాటర్‌ప్రూప్ షెడ్లను నిర్మిస్తున్నారు. ఇక.. రిసెప్షన్ వేడుక జరిగే ఎస్‌ఆర్ గార్డెన్‌కు వెళ్లే మార్గంలో డీప్ కట్ ఉంది. దీంతో వేడుకకు వచ్చే వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని.. కెనాల్‌పై కోటి రూపాయల వ్యయంతో బ్రిడ్జిని నిర్మించారు. ఐరన్‌తో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేశారు. మూడు లక్షల మంది దాటినా చెక్కు చెదరకుండా ఉండేలా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. భారీగా హాజరైన అతిథులతో వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పలు రంగాల ప్రముఖులతో పాటు.. పలు పార్టీల ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ వేడుక కోసం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుమారు రూ.250 కోట్లు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతుండటంతో.. తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..