హర్యానాలో ‘ న్యూ సీన్ ‘ ! కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ?

హర్యానా రాజకీయాల్లో చటుక్కున రంగంలోకి దిగిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా ఇక తాజాగా ‘ చక్రం ‘ తిప్పబోతున్నారు. ‘ కీ ‘ (తాళం) గుర్తు కలిగిన ఈయన పార్టీ నిజంగానే కీ రోల్ పోషించబోతోంది. ఓట్ల లెక్కింపు సరళిని బట్టి చూస్తే.. ఈయన ‘ కింగ్ మేకర్ ‘ గా అవతరించినా ఆశ్చర్యం లేదు. ఈ ట్రెండ్ చూస్తే మా పార్టీ చేతిలోనే ‘ కీ ‘ ఉన్నట్టు ఉంది […]

హర్యానాలో ' న్యూ సీన్ ' ! కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా ?

హర్యానా రాజకీయాల్లో చటుక్కున రంగంలోకి దిగిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా ఇక తాజాగా ‘ చక్రం ‘ తిప్పబోతున్నారు. ‘ కీ ‘ (తాళం) గుర్తు కలిగిన ఈయన పార్టీ నిజంగానే కీ రోల్ పోషించబోతోంది. ఓట్ల లెక్కింపు సరళిని బట్టి చూస్తే.. ఈయన ‘ కింగ్ మేకర్ ‘ గా అవతరించినా ఆశ్చర్యం లేదు. ఈ ట్రెండ్ చూస్తే మా పార్టీ చేతిలోనే ‘ కీ ‘ ఉన్నట్టు ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, హర్యానా అసెంబ్లీ.. జేజేపీ ‘ తాళం ‘ తోనే తెరుచుకుంటుందని ఆయన చమత్కరించారు. ఆయన పార్టీకి ఏడు నుంచి 10 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ తాజా సమాచారం ప్రకారం.. 11 సీట్లలో ఈ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదని వెల్లడవుతున్న నేపథ్యంలో.. ఎవరికి మద్దతునిస్తామన్న విషయమై దుష్యంత్ చౌతాలా క్లారిటీ ఇవ్వలేదు. తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, తమ పార్టీకి జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని, లెజిస్లేటర్ లీడర్ని ఎన్నుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు.

కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న ఈయన.. ఈ మధ్యే రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఈయన తండ్రి అజయ్ చౌతాలా ! నాలుగు సార్లు సీఎం గా వ్యవహరించి.. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధ్యక్షుడు కూడా అయిన ఓంప్రకాష్ చౌతాలా పెద్ద కుమారుడే అజయ్ చౌతాలా.. అన్నదమ్ముల గొడవల కారణంగా ఈ కుటుంబం చీలిపోయింది. అలాగే పార్టీ కూడా నిలువునా చీలింది. . దుష్యంత్ గత ఏడాది డిసెంబరులోనే ‘ సొంత కుంపటి ‘ పెట్టుకున్నారు. తన ముత్తాత, మాజీ డిప్యూటీ పీఎం కూడా అయిన దేవీలాల్ తో కలిసి ఒక సందర్భంలో ఆయన ప్రచారం చేశారు. కాగా-టీచర్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో ఓంప్రకాష్ చౌతాలా 10 ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

‘ మరో కుమారస్వామి ‘ దుష్యంత్ !
ఇదిలా ఉండగా.. దుష్యంత్ చౌతాలా ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదనే వార్తలు వినవస్తున్నాయి. నాడు కర్ణాటకలో కుమారస్వామి తరహాలో…. జేజేపీ అధ్యక్షుడైన ఈయన.. హర్యానా సీఎం కావచ్చునని అంటున్నారు. 38 సీట్లతో బీజేపీ లీడింగ్ లో ఉన్నప్పటికీ.. మెజారిటీకి మరో 7 సీట్ల దూరంలో ఉంది. 32 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా.. 11 స్థానాల్లో ముందంజలో ఉన్న జేజేపీకి కాంగ్రెస్ పార్టీ సీఎం పదవిని ఆఫర్ చేయడం విశేషం. ఇప్పటివరకూ ఏ అంచనాకూ రాని జేజేపీ పని… ‘ తంతే బూరెల బుట్టలో పడినట్లయింది ‘. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా ‘ కీ ‘ రోల్ పోషించబోతున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu