మళ్ళీ తెరమీదికి దొనకొండ.. కేపిటల్ కాదు గానీ..

అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంతో దొనకొండ క్రమంగా తెరమరుగైంది. అయితే తాజాగా మరోసారి దొనకొండ తెరమీదికి వచ్చింది. అయితే ఈసారి రాజధానిగా కాదు.. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు స్థానికుల్లో కొత్త ఆశల్ని రేపుతున్నాయి.

మళ్ళీ తెరమీదికి దొనకొండ.. కేపిటల్ కాదు గానీ..
Follow us
Rajesh Sharma

|

Updated on: Oct 13, 2020 | 7:31 PM

Donakonda again on to the screen: దొనకొండ.. ఏపీకి కేపిటల్ ప్రాంతం కాబోయి కొద్దిలో మిస్సయిన ప్రాంతమిది. ప్రకాశం జిల్లాలో విస్తారంగా అటవీ, ప్రభుత్వ భూములు గల ఈ ప్రాంతంలో ఏపీకి రాజధాని నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలంపాటే కొనసాగింది. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం… అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంతో దొనకొండ క్రమంగా తెరమరుగైంది. దొనకొండ రాజధాని అవుతుందన్న నమ్మకంతో అక్కడ భారీగా ఎత్తున భూములు కొన్న వారు తొలుత డీలా పడినా.. ఆ తర్వాత ఎంతో కొంతకు అమ్ముకుని బయటపడ్డారు. అయితే తాజాగా మరోసారి దొనకొండ తెరమీదికి వచ్చింది. అయితే ఈసారి రాజధానిగా కాదు..

ప్రకాశంజిల్లా దొనకొండపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నేవీ, డిఫెన్స్, సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇందువల్లే దొనకొండ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో వార్తల్లో నిలిచి తదుపరి చర్యల్లో పురోగతి లేకపోవడంతో మరుగునపడింది. ప్రస్తుతం నేవీ, డిఫెన్స్‌ కేంద్రాల ఏర్పాటు, సోలార్‌ ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో ఈ సారైనా అభివృద్ధికి పూర్తిస్థాయి అడుగులు పడతాయని ఇక్కడి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దొనకొండ పరిసర ప్రాంతాల్లో 50 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు అందుబాటులో ఉండటంతో వైసీపీ ప్రభుత్వం ఇక్కడ జాతీయస్థాయి పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. డిఫెన్స్‌ క్లస్టర్‌, అలాగే సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో మళ్ళీ దొనకొండకు మహర్దశ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రకాశంజిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దొనకొండ కేంద్రంగా డిఫన్స్ క్లస్టర్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రకాశం జిల్లా దొనకొండలో వెయ్యి మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెవెన్యూ సిబ్బంది సుమారు 5 వేల ఎకరాల భూమిని సర్వేచేసి నివేదిక తయారుచేశారు. మండలంలోని రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన భూమిని గుర్తించారు. 4 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ఏడాదిలోనే పూర్తి చేసి మరో ఏడాది నాటికి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

ఏడాదిలో అభివృద్ధి పనులు చేపట్టి రెండేళ్లల్లో పూర్తిస్థాయిలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5 వేల నుంచి 10 వేల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు అందనున్నాయి. రెవెన్యూ అధికారులు, ఏపీఐఐసీ అధికారులు అన్ని గ్రామాల్లోని భూములకు చెందిన మౌలిక సౌకర్యాలను మ్యాపుల ద్వారా నెడ్‌క్యాప్‌ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ఆయా గ్రామాల పరిధిలోని వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఉన్నారు. దీంతో దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్న ఆశ స్థానికుల్లో వ్యక్తం అవుతోంది.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దొనకొండను అభివృద్ది పధంలో నడిపించి వెనుకబడిన ప్రకాశంజిల్లాకు న్యాయం చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని అంటున్నారు. అయితే దొనకొండలో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. అందుకు అనుగుణంగా పరిశ్రమలకు నీటి సౌకర్యం కల్పించాలని, అందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటే దొనకొండ ప్రాంతం పూర్తిగా అభివృద్ది చెందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మరోవైపు గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం, తాత్సారం కారణంగా తాజాగా రాష్ట ప్రభుత్వం చేపడుతున్న పనుల పట్ల కొన్ని ప్రజా సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో ఆచరణ అమలు చేస్తే మంచిదేనంటున్నారు. దొనకొండలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Also read: ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ లభ్యం

Also read: తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్

Also read: తీరం దాటింది.. అయినా ఉత్తరాంధ్రకు ముప్పే!

Also read: రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసల జల్లు

Also read: చంద్రబాబుకు నోటీసిచ్చిన తహసీల్దార్

Also read: ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సినీ నిర్మాత

Also read: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు