అజిత్ పవార్ మరణాన్ని 2 నెలల ముందే ఊహించిన జ్యోతిష్యుడు..? నెట్టింట వైరల్ అవుతున్న పోస్టు
Astrologer Prediction on Ajit Pawar Death: ముంబాయి నుంచి బారామతి వెళ్తున్న ప్రైవేట్ జెట్ మిమానం ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు యత్నించిన క్రమంలో అదుపుతప్పి విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురు దుర్మరణం చెందారు. అయితే అజిత్ పవార్ మరణంపై రెండు నెలల ముందే ఓ జ్యోతిష్కుడు సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్టు పెట్టాడు..

బారామతి, జనవరి 29: మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 8.45 గంటల సమయంలో ముంబాయి నుంచి బారామతి వెళ్తున్న ప్రైవేట్ జెట్ మిమానం ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగేందుకు యత్నించిన క్రమంలో అదుపుతప్పి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తోసహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. బారామతి ఎయిర్‌పోర్టులోని ‘టేబుల్ టాప్ రన్‌వే’పై ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వే అంచున విమానం కూలిపోయిందని స్పష్టం చేసింది. విషాదకరంగా విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అజిత్ పవార్‌తో పాటు, ఆయనతో పాటు ఉన్న ఇద్దరు సిబ్బంది, విమానం ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందినట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో ఓ జ్యోతిష్కుడి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. గతేడాది నవంబర్ 8న జ్యోతిష్కుడు ప్రశాంత్ పెట్టిన ఓ పోస్ట్‌లో డిసెంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి మృతి చెందే అవకాశం ఉందని చెప్పాడు. ఒకప్పుడు ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడైన కొందరు రాజకీయ నేతలు డిసెంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య చనిపోయే అవకాశం ఉందని.. ఆ పోస్టులో పేర్కొన్నాడు. అయితే అజిత్ పవార్ మరణం సరిగ్గా ఇదే సమయంలో చోటు చేసుకోవడంతో ఆయన మరణాన్ని తాను ముందే ఊహించానని చెప్పడం నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ మేరకు సదరు జ్యోతిష్కుడు తాజాగా మరో పోస్టు పెట్టాడు. ‘డిసెంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు చనిపోతారని నేను అంచనా వేసాను….!! మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు…!!’ అని కీలక వ్యాఖ్యలు చేశాడు.
View this post on Instagram
అయితే జ్యోతిష్కుడు ప్రశాంత్ పోస్టుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన నేత ముఖ్యమంత్రి కాదు లేదా కేంద్ర ముఖ్యమంత్రి కూడా కాదు!!! తమరి అంచనా ఎక్కడ నిజమైందని ఓ యూజర్ వెటకారం చేశాడు. రెండో యూజర్ ‘కొన్ని’ అని చెప్పడం సులభం. మీరు నిపుణుడైన జ్యోతిష్కుడు కదా.. మరైతే రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి చెందినవాడో కూడా చెప్పాలి కదా అని ప్రశ్నించాడు. ‘బ్రో.. నీ అంచనాకు నోస్ట్రాడమస్ కూడా కదిలిపోతాడు’ అని మరో యూజర్ ఎద్దేవా చేశాడు. ‘నువ్వు ఎందుకు మరీ అంత ఉత్సాహంగా ఉన్నావు? ఇది సెలబ్రేట్ చేసుకునే విషయం ఏమీ కాదు. ఇప్పుడు మేమంతా నిన్ను ఓ ప్రవక్తగా గుర్తించాలా?’ అని మరో యూజర్ గడ్డి పెట్టాడు. ప్రస్తుతం సదరు జ్యోతిష్కుడి ప్రేలాపనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




