తుఫాన్ దూసుకొస్తోంది. వాయువేగంతో తీర ప్రాంత రాష్ట్రాలను అతలాకుతలం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కేరళలో ఈదురు గాలులతో కూడాని భారీ వర్షాలు పడుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. క్రమంగా వాయుగుండంగా మారుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ నాటికి పెను తుఫాన్‌గా మారే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.
దీని ప్రభావం కేరళపై తీవ్రంగా ఉండొచ్చనే అంచనాలు వెల్లడించారు. కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాలపైనా తౌక్టే తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ నెల 18 నాటికి గుజరాత్ దగ్గర తీరం దాటుతుందని.. కచ్చితంగా ఎక్కడనేది అంచనా వేయలేకపోతున్నారు.
ఈ తుఫాన్‌కు ‘తౌక్టే’గా నామకరణం చేశారు. ఇది భారత తీరప్రారంతానికి చేరుకుంటే.. ఇది ఈ సంవత్సరంలో మొట్టమొదటి తుఫాను అవుతుంది. ‘తౌక్టే’ అనే పేరును మయన్మార్ ఎంపిక చేసింది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి వ్యాపించి ఉంది. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌పై తౌక్టే ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీచే అవకాశం ఉంది అని తెలిపారు. మూడు రోజుల పాటు రాయలసీమలో జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని వెల్లడించారు. ఈ తుఫాన్ నైరుతి రుతుపవనాల రాకపై ఏమాత్రం ప్రభావం చూపించదని పేర్కొన్నారు. రుతు పవనాలు సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అయితే ఈ తుఫాను ఆ సమయానికి తగ్గుతుందని అన్నారు. సకాలంలో రెండు మూడు రోజుల ముందే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే సూచనలు ఉన్నాయని అన్నారు.
ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. గత 24 గంటల్లో అనంతపురం జిల్లా కుందుర్పిలో 4 సెం.మీ, కల్యాణదుర్గం, రాయదుర్గం, సెత్తూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 15, 16న ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.