Hyderabad: అంత ఈజీగా ఎలా నమ్ముతారో.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
ఈజీ మనీకి అలవాటు పడిన చాలా మంది కేటుగాళ్లు జనాలను మోసం చేసేందుకు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా ఇలానే అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.33లక్షలు కాజేశారు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ కేటుగాళ్లు అమాయకులను, విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త రీతిలో బురిడీ కొట్టిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన మాణిక్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారినపడి ఏకంగా రూ. 33 లక్షలు పోగొట్టుకున్నారు. అపెక్స్ డిజిటల్ క్యాపిటల్ పేరిట ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఇతడిని చేర్చిన ఖలేజాలు, ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ ద్వారా తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని నమ్మబలికారు. నిందితుల మాయమాటలు నమ్మిన బాధితుడు వారు సూచించిన నకిలీ ట్రేడింగ్ యాప్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, పలు దఫాలుగా తన బ్యాంక్ ఖాతాల నుంచి దాదాపు 33 లక్షల రూపాయలను బదిలీ చేశారు.
యాప్‌లో వర్చువల్‌గా భారీగా లాభాలు కనిపిస్తుండటంతో అది నిజమైన లాభమేనని బాధితుడు నమ్మాడు. అయితే, ఆ తర్వాత నిందితులు మరో అడుగు ముందుకేసి ఐపీఓ పెట్టుబడుల పేరుతో అదనంగా మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడంతో మాణిక్ రెడ్డికి అనుమానం వచ్చింది. తాను పెట్టిన పెట్టుబడిని, వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా సాంకేతిక కారణాలు చూపుతూ డబ్బు రావడాన్ని నిలిపివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సంగారెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుల వాట్సాప్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు డబ్బులు బదిలీ చేసిన వివిధ మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ప్రాథమికంగా గుర్తించి, వాటిని ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఈ సైబర్ గ్యాంగ్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవడానికి డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే పార్ట్‌టైమ్ జాబ్స్, అధిక లాభాలు ఇచ్చే స్టాక్ ట్రేడింగ్ యాప్‌ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సెబీ గుర్తింపు లేని ఏ రకమైన థర్డ్ పార్టీ యాప్‌లలోనూ పెట్టుబడులు పెట్టవద్దని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా cybercrime వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
