AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్మాత్ జాగ్రత్త! ఏదైనా జరగొచ్చు

సోష‌ల్‌మీడియా యాప్‌లు డౌన్‌లోడ్ చేసి చెల‌రేగిపోతున్నారు. పోస్టులు పెడుతున్నారు.  ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై ఓ క‌న్నేసి ఉంచాల‌ని అంటున్నారు సైబ‌రాబాద్ సీపీ..

తస్మాత్ జాగ్రత్త! ఏదైనా జరగొచ్చు
Sanjay Kasula
|

Updated on: Jul 17, 2020 | 5:50 AM

Share

CP Sajjanar Suggestions to Parents : క‌రోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పుడు అంతా ఇంటి నుంచే.. నాన్న ఉద్యోగం ఇంటి నుంచే.. పిల్ల‌లకు పాఠాలు ఇంటి నుంచే.. క‌రోనా దెబ్బ‌కు అందరి జీవితాలు ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి. లాక్ డౌన్ కారణంగా చదువులు తరగతి గదుల నుంచి ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి.

చదువులు ఇంటర్నెట్‌కు మారిన కొత్తలో మా పిల్లల ఆన్‌లైన్ లో క్లాసులు వింటున్నారని.. గొప్పలు చెప్పుకున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు ఇదేం చదువులురా బాబోయ్  అని అంటున్నారు. ఎందుకంటే.. ఫోన్ లో కార్టులు చూసే చిన్నారులు.. ఆన్ లైన్ టెక్నిక్స్ కు అలవాటు పడుతున్నారు. తెలిసో తెలియకో కొందరు ఆన్ లైన్ గేమ్స్ ను టచ్ చేస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు.

ఇక ఆన్‌లైన్ క్లాసులు ముగిసిన త‌ర్వాత కూడా పిల్ల‌లు నెట్‌ను ఎక్కువ‌గా వాడేస్తున్నారు. ప‌నిలోప‌నిగా అన్ని సోష‌ల్‌మీడియా యాప్‌లు డౌన్‌లోడ్ చేసి చెల‌రేగిపోతున్నారు. పోస్టులు పెడుతున్నారు.  ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై ఓ క‌న్నేసి ఉంచాల‌ని అంటున్నారు సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్.

సీపీ సజ్జనార్ ఏమన్నారంటే…

ప్రపంచాన్ని ఇంటర్నెట్ గుప్పిట్లో చూపిస్తుంది. ఇంటర్నెట్ మంచికైనా చెడుకైనా రెండు వైపుల పదునున్న కత్తి అని సీపీ సజ్జనార్ అన్నారు. ఇంటర్నెట్‌లో సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారని… జాగ్రత్తగా ఉండాలని… పిల్లల్ని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పిల్లలు యాక్టివ్‌గా ఉండకుండా చూడాలని సూచించారు. సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటితో పిల్లలను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని అన్నారు. పిల్లలు చేసే పోస్టింగ్‌లపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. సాధ్యమైనంత వరకూ పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలని…. తప్పనిసరైతే పెద్దల సమక్షంలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరగాళ్లపై అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలి సీపీ సజ్జనార్ సూచించారు.