అక్కను కాపురానికి తీసుకెళ్లడంలేదని బావను చంపేందుకు సుఫారీ

అక్క కాపురం నిలబెట్టేందుకు పోయి బావనే కిరాయి హంతకులతో చంపాలనుకున్నాడు. ఇంతలో వ్యవహారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. చట్టాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసే.. బావను చంపేందుకు సుఫారీ కుదుర్చుకున్నాడు

అక్కను కాపురానికి తీసుకెళ్లడంలేదని బావను చంపేందుకు సుఫారీ

అక్క కాపురం నిలబెట్టేందుకు పోయి బావనే కిరాయి హంతకులతో చంపాలనుకున్నాడు. ఇంతలో వ్యవహారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. చట్టాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసే.. బావను చంపేందుకు సుఫారీ కుదుర్చుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.

రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని సులేమానగర్‌ ప్రాంతానికి చెందిన షౌకత్‌(28) రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి అక్కను అదేప్రాంతానికి చెందిన జాకీర్‌ఖాన్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. కాగా కొద్దినెలల క్రితం కుటుంబ తగాదాల నేపథ్యంలో 498కేసు పెట్టింది జాకీర్‌ఖాన్‌ భార్య. దీంతో జాకీర్‌ఖాన్‌ జైలుకెళ్లాడు. జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత జాకీర్‌ఖాన్‌ భార్యను తీసుకెళ్లేందుకు ససేమిరా అన్నాడు. అంతేకాదు వేరు కాపురం కూడా పెట్టేశాడు.
అయితే, ఈ విషయం తెలిసిన కానిస్టేబుల్‌ షౌకత్‌ ఎలాగైనా బావను హతమార్చాలని పథకం వేశాడు. హసన్‌నగర్‌ ఇంద్రానగర్‌కు చెందిన మేస్త్రీ పనిచేసే సయ్యద్‌ సాజిద్‌(37)కు రూ.5లక్షలు సుఫారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో సాజిద్‌ విషయాన్ని తన స్నేహితులైన ఇంద్రానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ అస్లామ్‌ఖాన్‌(22), కూలి పనిచేసే షఫీ(45)తో పాటు షేక్‌ అనే వ్యక్తులకు చెప్పాడు. వీరందరూ కలిసి మద్యం తాగుతూ జాకీర్‌ఖాన్‌ను చంపేందుకు స్కెచ్ వేస్తుండగా.. గమనించిన స్థానికులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన రాజేంద్రనగర్ పోలీసులు.. సయ్యద్‌ సాజిద్‌తో పాటు అస్లామ్‌ఖాన్‌, షఫీని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. వారి ఇచ్చిన సమాచారం మేరకు కానిస్టేబుల్‌ షౌకత్‌ను కూడా శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. .