గిల్ సేనకు షాకిచ్చిన ఛోకర్స్ టీం.. WTC ఫైనల్ నుంచి టీమిండియా ఔట్..?
India WTC Qualification: ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచిన దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ ఫలితం ఆస్ట్రేలియాకు మాత్రమే కాదు.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలోని టీమిండియాకు కూడా ఇబ్బందులు పెంచింది. ఫైనల్ చేరాలంటే భారత్ ఇక దాదాపు తప్పులు లేని ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

India WTC Qualification: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (World Test Championship) ఫైనల్ రేసులో లెక్కలు వేగంగా మారుతున్నాయి. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో గెలుచుకోవడంతో పాయింట్ల పట్టికలో భారీ మార్పు వచ్చింది. తొలి టెస్టులో ఓడిన తెంబా బవుమా (Temba Bavuma) బృందం వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా 71.42 శాతం పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ (New Zealand) 72.22 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (Australia) 69.23 శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. భారత్ (India) 51.52 శాతంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఇక్కడే టీమిండియాకు అసలు చిక్కు మొదలైంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇంకా ఏడు టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో అత్యధిక మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
దక్షిణాఫ్రికా తర్వాత బంగ్లాదేశ్ (Bangladesh), ఇంగ్లండ్ (England)తో స్వదేశంలో సిరీస్‌లు ఆడనుంది. ఆ రెండు సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగితే ఆ జట్టు ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో మిగిలిన స్థానానికి భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య పోటీ మరింత తీవ్రంగా మారుతుంది.
భారత్ ముందుగా న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధిస్తే పాయింట్స్ పర్సంటేజ్ 58.97కు చేరుతుంది. అయితే రెండు టెస్టుల్లోనూ ఓడితే అది 43.59కు పడిపోతుంది. అప్పుడు WTC ఫైనల్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఆ తర్వాత భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. న్యూజిలాండ్‌పై రెండు మ్యాచ్‌లు ఓడి, ఆస్ట్రేలియాపై ఐదు టెస్టులను గెలిచినా భారత్ పాయింట్స్ పర్సంటేజ్ 59.26 వద్దే ఉంటుంది. ఆ పరిస్థితిలో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఇక మిగిలిన ఏడు టెస్టుల్లో ఆరు గెలిస్తే భారత్ పాయింట్స్ పర్సంటేజ్ 64.81కు చేరుతుంది. అయినా ఫైనల్ బెర్త్ ఖాయమవుతుందని చెప్పలేం. అందుకే భారత్‌కు ఏడు మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు అత్యుత్తమ మార్గంగా కనిపిస్తోంది. ఆరు విజయాలు సాధించినా ఇతర జట్ల ఫలితాలు భారత్‌కు అనుకూలంగా రావాల్సి ఉంటుంది.
భారత్ మిగిలిన WTC మ్యాచ్‌లు..
న్యూజిలాండ్ పర్యటన – 2 టెస్టులు
1వ టెస్ట్: నవంబర్ 19–23, 2026 – వెల్లింగ్టన్
2వ టెస్ట్: నవంబర్ 27–డిసెంబర్ 1, 2026 – క్రైస్ట్‌చర్చ్
ఆస్ట్రేలియా భారత పర్యటన – 5 టెస్టులు
1వ టెస్ట్: జనవరి 21–25, 2027 – నాగ్‌పూర్
2వ టెస్ట్: జనవరి 29–ఫిబ్రవరి 2, 2027 – చెన్నై
3వ టెస్ట్: ఫిబ్రవరి 11–15, 2027 – గువాహటి
4వ టెస్ట్: ఫిబ్రవరి 19–23, 2027 – రాంచీ
5వ టెస్ట్: ఫిబ్రవరి 27–మార్చి 3, 2027 – అహ్మదాబాద్
దక్షిణాఫ్రికా విజయం తర్వాత WTC ఫైనల్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. భారత్ ఇక ప్రతి టెస్టును కీలకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
