AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధ ప్రాతిపదికన సహాయం.. తక్షణం జీహెచ్ఎంసీకి రూ.5 కోట్లు

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర...

యుద్ధ ప్రాతిపదికన సహాయం.. తక్షణం జీహెచ్ఎంసీకి రూ.5 కోట్లు
Sanjay Kasula
|

Updated on: Oct 15, 2020 | 6:53 PM

Share

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం చెప్పారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణం జరుపుతామని సిఎం స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు, అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సిఎం చెప్పారు. నీళ్లుండగానే విద్యుత్ సరఫరా చేయడం ప్రమాదం కనుక, ఒకటీ రెండు రోజులు ఇబ్బంది కలిగినా ప్రాణనష్టం కలగకుండా ఉండేందుకు నీళ్లు పూర్తిగా తొలగిన తర్వాతనే విద్యుత్ సరఫరా చేయాలని సిఎం ఆదేశిచారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు.

హైదరాబాద్ నగరంలో వరదల పరిస్థితిని గమనిస్తే, చాలా చోట్ల చెరువుల ఎఫ్.టి.ఎల్. పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయమయ్యాయని సిఎం అన్నారు. అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిఎం పేర్కొన్నారు. అపార్టుమెంటు సెల్లార్లలో నీళ్లు నిల్వకుండా ఉండే ఏర్పాటు నిర్మాణ సమయంలోనే చేసి ఉండాల్సిందని సిఎం చెప్పారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని సిఎం ఆదేశించారు. ఇండ్లపై హై టెన్షన్ లైన్లు పోయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైన్ల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సిఎం ఆదేశించారు.

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు. హైదరాబాద్ లో ఎక్కువ ప్రభావం ఉన్నందున జీహెచ్ఎంసీలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు.

మంత్రులు కేటీఆర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.