పోలవరం ప్రొగ్రెస్ మా ఘనతే: చంద్రబాబు
పోలవరం పనుల్లో వేగం పెంచిన ఘనత తనదేనంటున్నారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు. పోలవరానికి తమ ప్రభుత్వం అప్పట్లో మిక్కిలి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే పనులు శరవేగంగా జరిగాయని ఆయన చెబుతున్నారు.
Chandrababu claims Polavaram credit: పోలవరం ప్రాజెక్టు 71 శాతం పూర్తి అయ్యిందంటే అది తాము అయిదేళ్ళ పాటు చూపిన ప్రత్యేక శ్రద్ధేనంటున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తమపై బురద జల్లే ప్రయత్నాలు వద్దని ఆయన ఏపీ ప్రభుత్వాధినేతలను కోరారు. దేశంలో 13 జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతుంటే, ముఖ్యమంత్రిగా తాను చూపిన ప్రత్యేక శ్రద్ధ వల్లనే పోలవరం పనులు 71 శాతం జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు. ఆదివారం హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
‘‘ రాష్ట్రానికి రెండు కళ్ళుగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాం.. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీరివ్వచ్చని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. కరవు రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని తలచాం.. దేశవ్యాప్తంగా 13 జాతీయ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతుంటే పోలవరం 71 శాతం పూర్తి చేశాం .. సవరించిన అంచనాలను రూ.55,548 కోట్లకు పెంచేలా కృషి చేశాం.. ’’ అని చెప్పుకొచ్చారు చంద్రబాబు.
ప్రధానిగా మన్మోహన్ పార్లమెంట్ సాక్షిగా ఆర్ అండ్ ఆర్, పునరావాసంపై స్పష్టత ఇచ్చారని, ప్రమాణ స్వీకారానికి ముందే ముంపు మండలాలను ఏపీలో కలిపేలా ఆర్డినెన్స్ తెప్పించానని చంద్రబాబు చెబుతున్నారు. ఇరిగేషన్ కాంపోనెంట్ 100 శాతం భరిస్తామని 2017 క్యాబినెట్ నోట్‌లో కేంద్రం స్పష్టం చేసిందని ఆయన వివరించారు. సవరించిన అంఛనాలను రూ. 55,548 కోట్లను ఆమోదించినట్లు కేంద్ర పలుమార్లు స్పష్టత నిచ్చిందని తెలిపారు.
2013లో తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం వల్ల ప్యాకేజీ 70శాతం పెరిగిందని, పోలవరం పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంతృప్తి వ్యక్తం చేశారని చంద్రబాబు వివరించారు. నీతి ఆయోగ్ సిఫారసుతోనే పోలవరం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, తమపై బురద జల్లి ప్రభుత్వం తప్పించుకో చూస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.