ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో జనజీవనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చౌక కరోనా పరీక్షా పద్ధతిని అభివృద్ధి చేసింది. దీనివల్ల ఎంతో సమయం ఆదా అవడంతో పాటు వ్యయం కూడా రూ.300దాకా తగ్గుతుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.
వివరాల్లోకెళితే.. ‘‘ముక్కు స్రావం నమూనా పరీక్షా కేంద్రానికి చేరగానే.. దాన్ని ఆరు నిమిషాల పాటు 98 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. దీంతో స్రావం నమూనా పొడిబారుతుంది. ఆ వెంటనే దాంతో నేరుగా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ – పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ-పీసీఆర్) పరీక్ష చేయొచ్చు’’ అని ఆయన వివరించారు. తాము అభివృద్ధి చేసిన పరీక్షా పద్ధతిలో వీటీఎంల వాడకం నుంచి మినహాయింపు లభించడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని రాకేశ్ మిశ్రా అన్నారు. పలుమార్లు ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం ఈ పద్ధతికి ఆమోదం కోసం భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)కి దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.