ఈసీ నిమ్మగడ్డ నిర్ణయాన్ని స్వాగతించిన బీజేపీ.. సీపీఐ, స్థానిక ఎన్నికలకు తాము రెడీనన్న సోము వీర్రాజు, రామకృష్ణ
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నాయి...
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమని బీజేపీ, సీపీఐ పార్టీలు ప్రకటించాయి. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మరింత ముందుకెళ్లారు. ఇదే సందర్భంలో ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలంటూ కొత్త విన్నపాలు విన్నవించారు. “గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ దాదాపు 25 శాతం దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుంది. పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని గతంలో సైతం ఫిర్యాదు చేయడం జరిగింది…
ఇదే అంశం అఖిలపక్ష సమావేశంలో కూడా నిమ్మగడ్డ గారికి చెప్పాం. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ పంచాయతీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసి పాత నోటిఫికేషన్ రద్దు చేయలేదు. పాత నోటిఫికేషన్ లను రద్దు చేయాలని బీజేపీ, ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తోంది.” అని సోము వీర్రాజు అన్నారు. కాగా, అటు, సీపీఐ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తమ పార్టీ సంసిద్ధతను ప్రకటించారు.