Breaking మోగిన బీహార్ ఎన్నికల నగారా

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. పాండమిక్ పరిస్థితిలో భారీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. నవంబర్ 29 నాటికి కొత్త శాసనసభ కొలువు దీరాల్సి వున్న తరుణంలో అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది.

Breaking మోగిన బీహార్ ఎన్నికల నగారా
Follow us

|

Updated on: Sep 25, 2020 | 1:38 PM

బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. మొదటి విడతకు సంబంధించి అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసి.. అక్టోబర్ 28న పోలింగ్ జరుపుతామని వెల్లడించారు. మొదటి విడతలో 16 జిల్లాల పరిధిలోని 71 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇందుకోసం 31 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు.

రెండో విడతలో 17 జిల్లాల పరిధిలోని 94 శాసన సభా స్థానాలకు అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి.. నవంబర్ మూడవ తేదీన పోలింగ్ జరుపుతామని, ఇందుకోసం 42 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. మూడు విడతలో 15 జిల్లాల పరిధిలోని 78 సీట్ల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి.. నవంబర్ 7వ తేదీన 33 వేల 50 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. నవంబర్ 10వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు ఎన్నికల సంఘం సుదీర్ఘ సమాచలోచనలు జరిపిందని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. కరోనా ప్రభావంతో సుమారు 70 దేశాలలో రకరకాల ఎన్నికలను వాయిదా వేశారని ఆయన తెలిపారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ఎప్పటికి ఎండ్ అవుతుందో తెలియని పరిస్థితి వుందని, అందువల్ల ఎన్నికల నిర్వహణ పలు జాగ్రత్తలతో నిర్వహించాలని నిర్ణయించామని ఆయన వివరించారు. రాజ్యసభ ఎంపీల ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించిన అనుభవంతో కరోనా జాగ్రత్తలతో బీహార్ ఎన్నికల షెడ్యూల్ రూపొందించామని, ఎన్నికల ఏర్పాట్లలోను పలు మార్పులు చేర్పులు చేశామని ఆయన తెలిపారు.

కరోనా ప్రభావం నేపథ్యంలో నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రచారం దాకా ఈసీ పలు ఆంక్షలు విధించింది. నామినేషన్ దాఖలుకు కేవలం ఇద్దరు మాత్రమే రావాలని, డోర్ టు డోర్ ప్రచారానికి కేవలం అయిదుగురు వ్యక్తులే వెళ్ళాలని ఈసీ నిర్దేశించింది. రోడ్ షోలలో కేవలం అయిదు వాహనాలనే వినియోగించాలని రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలను విడుదల చేశారు చీఫ్ ఎలెక్షన్ అధికారి సునీల్ అరోరా.

అదే సమయంలో పోలింగ్ స్టేసన్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని.. తద్వారా పోలింగ్ స్టేషన్ల దగ్గర భారీ క్యూలను నిరోధించాలని ఎన్నికల సంఘం తలపెట్టింది. పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచి.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే 11 గంటల పాటు పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

బీహార్ రాష్ట్రంలో మొత్తం 7 కోట్ల 29 లక్షల మంది ఓటర్లుండగా.. ప్రతీ ఓటరుకు డిస్పోజబుల్ హ్యాండ్ గ్లోవ్స్ ఇవ్వాలని, తద్వారా ఈవీఎం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా వుంటుందని ఈసీ తలపెట్టింది. ఫేస్ మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్, పీపీఈ కిట్స్, శానిటైజర్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని సీఈసీ ఆదేశించింది.

కోవిడ్ జాగ్రత్తలపై అన్ని రకాల మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా ఓటర్లను మోటివేట్ చేసి.. పెద్దఎత్తున ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని సీఈసీ తెలిపారు. ప్రత్యేక మోనిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల అక్రమాలను నియంత్రిస్తామని ఆయన చెప్పారు.

బీహార్.. ఒక రాజకీయ చదరంగం

ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 29 నాటికి ముగుస్తున్నందున ఆనాటి కల్లా కొత్త అసెంబ్లీ కొలువు దీరాల్సి వుంది. ప్రపంచమంతా కరోనా వైరస్ బారిన పడిన పాండమిక్ పరిస్థితిలో జరుగుతున్న తొలి పెద్ద ఎన్నికలుగా బీహార్ అసెంబ్లీ పోల్స్ మిగిలి పోనున్నాయి. 243 మంది సభ్యులు గల బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యతలో వుంది.

బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి సారథి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాలుగోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. మరోవైపు జైలు పాలైన మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ కూటమిని ఢీకొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో వున్న ఎన్డీయే కూటమిలో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీలుండగా.. చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని ఎల్జేపీ.. ఒంటరి పోటీకి సిద్దమవుతోంది. కోరినన్న సీట్లు ఇవ్వకపోతే సొంతంగా పోటీకి దిగేందుకు చిరాగ్ పాశ్వాన్ రెడీ అవుతున్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో వుండడంతో ఆర్జేడీకి ఆయన తనయుడు తేజస్వీ యాదవ్ సారథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలను ఎదుర్కోబోతున్న విపక్ష ఆర్జేడీ.. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో నితీశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఈ అంశంతోపాటు వరద సాయంలో ప్రభుత్వ వైఫల్యం, కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణల బిల్లులే ప్రధానాంశాలుగా ఎన్నికలను ఎదుర్కోబోతోంది. దీనికి గురువారమే ఓ ట్రాక్టర్ ర్యాలీ ద్వారా తేజస్వీ యాదవ్ తెర లేపారు.

మరోవైపు 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహాఘట్‌బంధన్ పేరిట ఎన్నికలను ఎదుర్కొన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. మెజారిటీ సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. రెండేళ్ళ తిరగక ముందే లాలూ యాదవ్ కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా మహాఘట్‌బంధన్ నుంచి నితీశ్ బయటికొచ్చారు.

2013లో తాను వ్యతిరేకించిన నరేంద్ర మోదీతో మంతనాలు సాగించి, బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా అయిదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. బీజేపీతో కలిసిన తర్వాత కూడా ఇరు పార్టీలు పెద్దగా సఖ్యతతో పనిచేయకపోయినప్పటికీ.. తాజా ఎన్నికలను నితీశ్ సారథ్యంలోనే ఎన్డీయే కూటమి ఎదుర్కొంటుందని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే ఈ రెండు పార్టీలకు ఎల్జేపీ రూపంలో కొత్త తలనొప్పి రావడం ప్రస్తుత ఎన్నికలను రక్తి కట్టిస్తోంది.