దశాబ్దాల యుద్ధం.. పొతిరెడ్డిపాడు జగడం

దశాబ్దాల యుద్ధం.. పొతిరెడ్డిపాడు జగడం

–తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న యుద్ధం –జీవో పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ – మానవత్వంతో వ్యవహరించాలన్న ఏపీ – అసలు వాటాలెంత? ఎవరి వాదనేంటి? రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగునీరు అందించే పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యాన్ని పెంచుతూ AP ప్రభుత్వం తీసుకొచ్చిన GOపై రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం మొద‌లైంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 10 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో నెం.203 తీసుకొచ్చింది. పరిపాలనా అనుమతులూ ఇచ్చింది. ఇదే […]

Ram Naramaneni

| Edited By: Ravi Kiran

May 18, 2020 | 2:06 PM

తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న యుద్ధం
జీవో పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ
మానవత్వంతో వ్యవహరించాలన్న ఏపీ
అసలు వాటాలెంత? ఎవరి వాదనేంటి?

రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగునీరు అందించే పోతిరెడ్డిపాడు సామ‌ర్థ్యాన్ని పెంచుతూ AP ప్రభుత్వం తీసుకొచ్చిన GOపై రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం మొద‌లైంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 10 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో నెం.203 తీసుకొచ్చింది. పరిపాలనా అనుమతులూ ఇచ్చింది. ఇదే రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉన్నా నేపథ్యంలో ఒక్కసారిగా GO పరస్సర విమర్శలకు తావిచ్చింది.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తమ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయంటున్నారు తెలంగాణ ప్రజలు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు సామర్థ్యం విద్యుత్‌ ఉత్పాదనతో కలిసి 64 వేల క్యూసెక్కుల వరకూ ఉంది. ఇంకో 20వేల క్యూసేక్కులు పెంచితే ఏపీ భారీగా శ్రీశైలం నీటిని తరలిస్తుందనే ఆరోపణలున్నాయి. అదే జరిగితే శ్రీశైలంపై ఆధారపడ్డ తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందని మంత్రి హారీష్‌రావు అంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఖాళీ అవుతుందన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం సుమారు 120 టిఎంసీల సామర్థ్యంతో చేపట్టిన కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లక్ష్యాలు నీరుగారిపోతాయంటున్నారు.అంతేకాదు.. దీనిపై క్రిష్ణా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం.


అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ రాయలసీమ ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో పలు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు.
1. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్‌బీసీ).. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాలకు నీటిని విడుదల చేస్తారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడం, ఆ నీటిని బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌(బీసీఆర్‌) వరకూ తరలించే పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
2. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు రోజుకు 3 టీఎంసీల చొప్పున బీసీఆర్‌కు తరలించి.. అక్కడి నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు జలాలను సరఫరా చేయడానికి శ్రీశైలం జలవిస్తరణ ప్రాంతం నుంచి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రాయలసీమ ఎత్తిపోతలగా నామకరణం చేసింది. ఈ పథకానికి రూ.3,890 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
3. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి విడుదల చేసే జలాలను పూర్తిస్థాయిలో తరలించేలా నిప్పుల వాగు సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటికి రూ.1,501 కోట్లు వ్యయం అవుతుంది.
4.కుందూ వరద నీటిని ఒడిసిపట్టేలా రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ.. జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,677 కోట్లు వ్యయం కానుంది.
5.పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు చేరిన జలాలను ఎస్సార్‌బీసీ, గాలేరు–నగరి కాలువల ద్వారా గోరకల్లు జలాశయానికి తరలించడానికి వాటి సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,149 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
6.గాలేరు–నగరి నుంచి వెలిగల్లు, కాలేటి వాగు, శ్రీనివాసపురం రిజర్వాయర్లను నింపడానికి చక్రాయిపేట ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,600 కోట్లు అవసరం.
వైఎస్సార్‌ జిల్లాలో ముద్దనూరు వద్ద కొత్తగా 20 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
7.గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం సామర్థ్యం పెంపు పనులకు రూ.6,310 కోట్లు.. రెండో దశలో కాలువల సామర్థ్యం పెంపు.. జిల్లేడుబండ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.1,518 కోట్లు అవసరమని అంచనా. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు ప్రణాళిక

రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పిన జగన్‌… పై ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్‌పై జీవో ఇచ్చారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దమని… వరద ఉన్నప్పుడు మాత్రమే తీసుకెళ్లాల్సిన పథకానికి కొత్తగా విస్తరణ పనులేంటని తెలంగాణ ప్రశ్నిస్తోంది.

చరిత్ర చూస్తే….
1977 అక్టోబ‌రు 28వ తేదీన కృష్ణాన‌ది ప‌రివాహ‌క రాష్రాల మధ్య ఒప్పందం
మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌, ఆంధ్రప్రదేశ్ అంత‌రాష్ట్ర ఒప్పందం
ఒక్కో రాష్ట్రం 5టీఎంసీల నుంచి నీటిని త‌మిళ‌నాడు తాగునీటికివ్వాలి
1988లో శ్రీ‌శైలం జ‌లాశ‌య విస్తరణలో పోతిరెడ్డిపాడు గ్రామం వ‌ద్ద ప్రధాన రెగ్యులేట‌ర్ నిర్మాణం
అక్కడి ప్రధాన కుడికాల్వ 16.8 కి.మీ. నిర్మించారు
బ‌న‌క‌చెర్ల క్రాస్ రెగ్యులేట‌ర్ వ‌ద్దకు నీరు వస్తుంది
బ‌న‌క‌చెర్ల క్రాస్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద ఎడ‌మ వైపున 3 లింక్‌కాల్వలున్నాయి.
తెలుగు గంగ, గాలేరీ-నగరి, SRBC ద్వారా జలాలు తరలిస్తారు
వెలుగోడు వ‌ద్ద 16.95టీఎంసీల సామ‌ర్థ్యంతో జ‌లాశ‌యం ఉంది
అయితే వరద ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి రాయలసీమకు కృష్ణా జలాలు
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తరలింపు
శ్రీశైలం కుడి కాల్వ కింద 11 వేల 500 క్యూసెక్కులతో రెగ్యులేటర్‌ నిర్మాణం జరిగింది
శ్రీశైలం వద్ద 841 అడుగులకు నీరు చేరితే ఈ రెగ్యు లేటర్‌ ద్వారా నీటి విడుదలకు అవకాశం
వైఎస్‌ అధికారంలోకి వచ్చాక 44వేల క్యూసెక్కులకు పెంచారు
2005 సెప్టెంబర్ 13 న జీవో 170 జారీ చేశారు
పాత తూములు 4, కొత్తగా మరో 7 తూముల ఏర్పాటు చేశారు
11వేల 500 క్యూసెక్కుల నుండి 40వేలకు పెరిగిన సామర్థ్యం
అప్పట్లోనే తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు. ఉద్యమాలు జరిగాయి
తాజాగా విభజన అనంతరం జగన్‌ నిర్ణయంతో మరోసారి వివాదం

APవాదన
మాకు రావాల్సిన వాటాల్లో నుంచే జలాలు తరలిస్తాం
మాకు 512 TMCల వాటా ఉంది
ఇందులో ఎవరి అనుమతి అవసరం లేదు
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించేది వరద నీరు మాత్రమే
చెన్నైకి తాగునీటి సరఫరాతో సహా తెలుగుగంగకు 45 TMCలు
గాలేరు-నగరికి 38 TMCలు, శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19 TMCలు
మొత్తం 102 TMCలు అవసరం
ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసినపుడు 45 రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అంచనా
కానీ గత పదేళ్లుగా 30 రోజులకు మించి వరద ప్రవాహం లేదు
30 రోజుల్లో 102 TMCల నీటిని మళ్లించాలంటే రోజుకు 40 వేల క్యూసెక్కుల సామర్థ్యం అవసరం
శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే 40 వేల క్యూసెక్కులు తీసుకెళ్లాలని డిమాండ్‌

తెలంగాణ అభ్యంతరాలు
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్ధ్యం పెంచితే తెలంగాణకు నీళ్లు రావు
పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి, SLBC ప్రాజెక్టులకు నీటి కొరత
శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 260 TMCలు
ఆవిరి పోను 240 టీఎంసీల నీటిని నిల్వ అవకాశం
అనుమతిస్తే 215 TMCల సామర్ధ్యం కలిగిన శ్రీశైలం రిజర్వాయర్‌ 15 రోజుల్లో ఖాళీ
పోతిరెడ్డి పాడు ద్వారా ముందుగానే నీటిని తరలిస్తే సాగర్‌ కూడా ఏడారే
బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించినవి 811 TMCలు
ఏపీ ఇచ్చిన కేటాయింపులు 512 TMCలు
తెలంగాణ 299 TMCలు
తెలంగాణలో కృష్ణానది పరీవాహక ప్రాంతం 68 శాతం
కేవలం 299 TMCలే వినియోగించుకుంటోంది
31 శాతం పరీవాహక ప్రాంతమున్న ఏపీ 512 TMCలు వాడుకుంటోంది
వాటాలపై ఇప్పటికే ట్రిబ్యునల్‌ వద్ద వివాదాలు
తీర్పు రాకముందే ప్రాజెక్టులు నిర్మాణం మంచిది కాదన్న తెలంగాణ
పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదులు

మొత్తానికి కేసీఆర్‌, జగన్‌ మధ్య సఖ్యత ఉందని.. చర్చలు ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటారని అంతా భావించారు. మూడుసార్లు సమావేశమైన ఇద్దరు సీఎంలు భరోసా ఇచ్చారు. దశాబ్ధాలుగా నలుగుతున్న వివాదాస్పద అంశాలకు పరిష్కారం దొరుకుతుందన్నా ఆశించారు. కానీ అనూహ్యంగా పోతిరెడ్డిపాడు వివాదం తలెత్తింది. దీనిపై ఫిర్యాదుల వరకూ వెళ్లడం చూస్తుంటే.. యుద్ధం తప్పదనిస్తోంది. మరి చూడాలి.

ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో చర్చ జరిగింది… లైవ్‌షో కోసం కింద లింక్‌క్లిక్‌ చేయండి.


సమాచారం: ప్రభుత్వ వెబ్‌ సైట్లు, అధికారులు, నిపుణుల బైట్ల నుంచి సేకరించడం జరిగింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu