AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాదిగా తలుపులు తెరుచుకోలేదు.. పేగుబంధం పలకరించలేదు.. చివరికి ఎముకల మూట మిగిలింది!

సుమారు 18 నెలలుగా మూసి ఉన్న ఇంట్లో 57 ఏళ్ల మహిళ అస్థిపంజరం బయటపడింది. మృతురాలు ఒంటరిగానే నివసించేవారని, రెండేళ్లకు పైగా కుమార్తెతో కూడా సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. ఆమె తీర్థయాత్రలకు తరచూ వెళ్లడంతో కుటుంబ సభ్యులు మరోసారి యాత్రకు వెళ్లి ఉంటారని భావించారు. ఇంటి తలుపులు లోపలి నుంచి లాక్ చేసి ఉండగా.. ఏడాది తర్వాత ఓ రోజు ఆ తలుపులు తెరచుకున్నాయి..

ఏడాదిగా తలుపులు తెరుచుకోలేదు.. పేగుబంధం పలకరించలేదు.. చివరికి ఎముకల మూట మిగిలింది!
Bengaluru Woman Skeleton Found
Srilakshmi C
|

Updated on: Aug 09, 2026 | 11:50 AM

Share

బెంగళూరు, ఆగస్ట్ 9: సుమారు 18 నెలల క్రితం మరణించినట్లు అనుమానిస్తున్న 57 ఏళ్ల మహిళ అస్థిపంజరం ఆమె ఇంటి బాత్‌రూమ్‌లో లభ్యమైంది. బెంగళూరులో కలకలం రేపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని బాగలకుంటె పరిధిలోని హవనూర్ లేఅవుట్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో మృతురాలిని దాక్షాయిణిగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త పేరు ఉమేశ్ వై. స్వస్థలం బెళగావి. దాక్షాయిణి కుటుంబం సుమారు 15 ఏళ్లుగా అదే డూప్లెక్స్‌ ఇంట్లో నివసిస్తోంది. ఆమె భర్త, కుమారుడు చాలా ఏళ్ల క్రితమే మృతి చెందారు. కుమార్తె మాత్రం బాగలకుంటె సమీపంలో ఉంటుంది. అంటే మృతురాలి ఇంటికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో నివసిస్తోంది.

తలుపులు లోపలి నుంచి లాక్

ఇల్లు చాలా కాలంగా మూసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం రాత్రి పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బాత్‌రూమ్‌లో దాక్షాయిణి అస్థిపంజరం కనిపించింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు, గొలుసు అలాగే ఉన్నాయి. ఇంట్లోని వెండి వస్తువులతో పాటు ఇతర విలువైన వస్తువులు కూడా ఎలాంటి చోరీకి గురికాలేదు. దీంతో దోపిడీ లేదా హత్య కోసం దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలను పోలీసులు ప్రాథమికంగా తోసిపుచ్చారు. ప్రధాన గేటు, ఇంటి తలుపు, బాత్‌రూమ్ తలుపు కూడా లోపలి నుంచి తాళం వేసి ఉండటం కీలకంగా మారింది. దీంతో దాక్షాయిణి మరణించే సమయంలో ఇంట్లో ఒంటరిగానే ఉండి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

రెండేళ్లుగా కూతురితో మాటలు బంద్‌..

పోలీసుల వివరాల ప్రకారం దాక్షాయిణి కొంతకాలంగా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కుమార్తెకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్లకు పైగా తల్లీకూతుళ్ల మధ్య ఎలాంటి సంబంధాలు లేకపోయినట్లు పోలీసులు తెలిపారు. దాక్షాయిణి తరచూ తీర్థయాత్రలకు వెళ్లేవారని తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు కూడా ఆమె యాత్రలకు వెళ్లేవారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో ఆమె మరోసారి తీర్థయాత్రకు వెళ్లి ఉంటారని కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు భావించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతకాలం ఇంట్లో మృతదేహం ఉండటం, ప్రారంభ రోజుల్లో మృతదేహం నుంచి వచ్చే దుర్వాసనను పొరుగువారు గుర్తించకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా మృతదేహం కుళ్లిపోయే సమయంలో వచ్చే దుర్వాసన గోడలు, మూసివున్న తలుపులను దాటి బయటకు వ్యాపించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటి నుంచి ఎలాంటి వాసన లేదా అనుమానాస్పద పరిస్థితిని ఎవరూ గుర్తించకపోవడం విచారణలో కీలక అంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మృతురాలి బంధువు మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. మహేశ్ స్వయం ఉపాధి పొందుతున్నారని, దాక్షాయిణి కుమార్తెను వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అస్థిపంజరాన్ని వైద్య పరీక్షలకు పంపించి, దాక్షాయిణి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సుమారు 18 నెలల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Follow Us