మీరు ఎంత సంపాదించిన వేస్ట్..! భారత మాజీ కెప్టెన్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించినా, మ్యాచ్‌లో బ్యాట్ మధ్యలో బంతి తగిలినప్పుడు వచ్చే ఆనందం, అద్భుతమైన కవర్ డ్రైవ్ ఇచ్చే కిక్ మరేదీ ఇవ్వలేదని గంగూలీ చెప్పినట్లు పేర్కొన్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి ఈ తరం క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకప్పుడు అతను ఇండియన్ క్రికెట్ టీమ్‌కు దాదా. ప్రపంచ క్రికెట్‌కు కొరకరాని కొయ్య. భారత జట్టుకు విదేశాల్లో గెలవడం నేర్పిన ఘనుడు. మాటకు మాట బదులివ్వడం నేర్పి.. గంగిగోవు లాంటి టీమిండియాను బెబ్బులిలా మార్చాడు. అందుకే అతనంటే.. ఇప్పటికీ చాలా మంది క్రికెట్ అభిమానులు ఆరాధిస్తారు, మాజీ క్రికెటర్లు సైతం ప్రేమిస్తారు. అయితే అలాంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దాదా మాట్లాడుతూ.. మీరు క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి కూడబెట్టినా.. మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొట్టే ఓ కవర్ డ్రైవ్, బ్యాట్ మధ్యలో బాల్ తగిలితే వచ్చే ఫీలింగ్ ఎప్పుడూ రాదు అని అన్నారు. నిజమే కదా.. ఓ ఆటగాడికి తన అద్భుతమైన షాట్, లేదా సూపర్ డెలవరీ ఇచ్చినంత కిక్ కానీ, సెల్ఫ్ స్యాటిఫ్యాక్షన్ కానీ జీవితంలో మరేది ఇవ్వదు. అదో తెలియని ఫీలింగ్. దాన్నే దాదా ప్రస్తావిస్తూ ఒక సత్యాన్ని చెప్పాడు. నిజానికి గంగూలీ ఆఫ్ సైడ్ కొట్టే షాట్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.
ఆఫ్ సైడ్ ఎంత మంది ఫీల్డర్లను పెట్టినా కూడా వాళ్ల మధ్య నుంచి అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు ఆడేవాడు. అందుకే దాదాను గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ అని కూడా పిలుస్తుంటారు. అలాగే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సైతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత వేరే వేరే మార్గాల నుంచి డబ్బు ఎంత సంపాదించినా ఆటలో ఉండే ఆ మజాను మాత్రం పొందలేరు. వాళ్లు వారి బ్యాటింగ్ ఇచ్చినంత కిక్కు మరేది ఇవ్వలేదు.
